'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి.. తన తదుపరి సినిమాపై స్పష్టత ఇచ్చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో భాగంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పనిచేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంతో మహేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.
రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. ఇందులో అగ్రహీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య.. రూ.350 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.