డైలాగులపై పట్టు రావాలని, సన్నివేశాలు పండాలని సినిమా స్క్రిప్ట్ తీసుకొని మొత్తం తన స్వహస్తాలతో తిరగరాసే కథానాయకుడు ఎవరు?.. ఆయన సినిమాపై పెట్టే శ్రద్ధ అది.
ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వ్యాయామం పూర్తిచేసి 6గంటలకే తన పనులన్నీ పూర్తిచేసుకొని మేకప్ వేసుకొని 7గంటలకల్లా చిత్రీకరణకు సిద్ధంగా ఉండే నటుడెవరు? ..ఆయనకున్న క్రమశిక్షణకు ఉదాహరణిది.
సహనటుడు మద్యానికి బానిసై జీవితాన్ని పాడుచేసుకుంటుంటే.. మందలించి దారిలో పెట్టిన మహోన్నత స్నేహతత్వం ఎవరిది? ..ఆయనలోని మానవత్వానికి నిదర్శనమిది.
అలాంటి మహానటుడు నందమూరి తారక రామారావు సినీ ప్రపంచాన్ని వదిలి వెళ్లాడంటే ఎలా? వెళ్లలేదు. క్రమశిక్షణతో నడుచుకొనే ప్రతి నటుడిలోనూ ఆయన స్ఫూర్తి బతికే ఉంది. సినిమానే ప్రాణంగా జీవించే ప్రతి ఒక్కరిలోనూ ఆయన ప్రతిబింబం ప్రతిఫలిస్తూనే ఉంది. తోటి కళాకారులకు అండగా నిలుస్తున్న ప్రతి మానవతా హృదయంలోనూ నిలువెత్తు విగ్రహమై ఆయన నిలుచొనే ఉన్నారు.
నటనే శ్వాసగా, సినిమానే గుండెచప్పుడుగా, తెలుగు ప్రేక్షకులే దేవుళ్లుగా భావించిన నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. 'మనదేశం'తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 'పాతాళభైరవి'తో దేదీప్యమానమైంది. ఆ 'తోటరాముడు'.. తర్వాత 'ఇంటింటి రాముడ'య్యాడు. 'మాయాబజార్'లో కృష్ణుడిగా ఆయన జీవిస్తే.. తెలుగు ప్రజలు ఆయన్ని గుండెల్లో శ్రీకృష్ణభగవానుడిగా ప్రతిష్టించుకున్నారు. అదీ ఆయన సమ్మోహన రూపానికి, అద్భుత నటనకు నిదర్శనం. 'రక్తసంబంధం' సినిమాలో సావిత్రికి అన్నగా నటిస్తే.. అభిమానులకు చిరకాల 'అన్న'గా నిలిచిపోయారు. చూపులేని వాడిగా, కురూపిగా తెరపైన కనిపించినా ప్రేక్షకులు ఆయన అభినయానికి ముగ్ధులయ్యారు.
ప్రయోగాలకు పెట్టింది పేరాయన. ద్విపాత్రాభినయం చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 5 పాత్రల్లోనూ మెప్పించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేస్తూ.. నటించగల బహుముఖ సామర్థ్యం ఆయన సొంతం. 'దానవీర శూరకర్ణ'లో దర్శకుడిగా, నటుడిగా ఆయన విశ్వరూపం చూపించారు. 'శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర చరిత్ర' ఆయన నట, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమే. 'గుండమ్మ కథ'లో ఆయన అక్కినేనితో తెరపంచుకొని అప్పుడే మల్టీస్టారర్ చిత్రాలకు బీజం వేశారు. 1954లో ఉత్తమ చలన చిత్రాలకు జాతీయ బహుమతులు ఇవ్వడం ఆరంభమైనప్పుడు 'తోడుదొంగలు' సినిమాకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్' సారథ్యంలోనే నిర్మించారు. సొంతంగా సినిమాలు నిర్మించడమే కాదు.. ఎంతో మంది ప్రతిభావంతులకు 'వెండితెర'పై కొత్త జీవితాన్నిచ్చారాయన. దర్శకులు ఎస్.కృష్ణారావు, యోగానంద్‌లను ఆయనే పరిచయం చేశారు. నాయికలు బి.సరోజాదేవి, గీతాంజలి వంటి వారు ఆయన చిత్రాల్లోనే తొలిసారి మెరిశారు.
సినిమానే జీవనం..
ఆయనకు సినిమా అంటే కళే కాదు.. జీవన విధానం. తన పెద్దకుమారుడు (రామకృష్ణ సీనియర్) చనిపోయినప్పుడు, ఆ బాధను మరిచిపోవడానికి ఎడతెరపి లేకుండా సినిమాలు చేశారు. ఆయనకు సినిమానే సాంత్వన.
క్యాన్సర్ మహమ్మారితో తనువు చాలించిన తన సతీమణి బసవతారకం పేరుతో ఒక మెడికల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో వచ్చే లాభాలను ఆ ట్రస్టుకు తరలిద్దామనుకున్నారు. ఆ సినిమా సరిగా ఆడలేదు అప్పుడు మోహన్‌బాబుకు 'మేజర్ చంద్రకాంత్' చేసి పెట్టి, తనకు అందిన పారితోషికంతో బసవతారకం ఆసుపత్రి భవంతులు కట్టించడం మొదలుపెట్టారు. ఆయనకు సినిమానే సేవ.
'పాతాళభైరవి' చిత్రంలో తన సహచరుడుగా నటించిన బాలకృష్ణ(సీనియర్) మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా వచ్చేవారు. ఆయన్ని చిత్రం నుంచి తప్పించాలని నిర్మాత తలచారు. అలా చేస్తే అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయని నచ్చజెప్పి సహనటుడికి అవకాశం చేజారకుండా చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ ఏనాడూ చిత్రీకరణకు ఆలస్యంగా రాలేదు. ఆయనకు సినిమానే జీవన విధానం.
అలాంటి ఆయన భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లి ఇరవై అయిదేళ్లై ఉండవచ్చు.. కానీ సినీ కళామతల్లినే నమ్ముకున్న ఎంతో మందిలో ఆయన స్ఫూర్తిగా పుడుతూనే ఉన్నారు. వారి హృదయాల్లో 'ఎన్టీఆర్' అనే తారకమంత్రమై ప్రతిధ్వనిస్తూనే ఉన్నారు.
దేవాలయాలు కట్టే రోజులొస్తాయి
"ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.." - ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాట చాలు కదా ఆయన ఏమిటనేది చెప్పడానికి! సినీ రంగానికే కాదు, రాజకీయ రంగానికే కాదు.. తెలుగు ప్రజలందరికీ ఆయనొక ఆదర్శ పురుషుడు. భవిష్యత్ తరాలు ఆయన గురించి దేవాలయాలు కట్టే రోజులు వస్తాయి. 1974లో తొలిసారి నేను ఓ సినిమాకోసం ఎన్టీఆర్‌ని సంప్రదించా. అప్పట్నుంచి సొంత బిడ్డలకంటే ఎక్కువగా చూశారు. మా నిర్మాణ సంస్థకు తన స్వహస్తాలతో వైజయంతీ మూవీస్ అని నామకరణం చేశారు. మద్రాస్‌లో ఎప్పుడూ నా కార్లోనే ప్రయాణం చేసేవాళ్లం. ఆయనతో 'ఎదురులేని మనిషి', 'యుగపురుషుడు' సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆయన తనయుడు, మనవళ్లతోనూ సినిమాలు చేశా. రాజకీయాల్లోకి వెళ్లాక కూడా సినిమా పరిశ్రమ ఎలా ఉంది? ఇప్పుడు తీస్తున్న సినిమాలేమిటని ఆరా తీసేవారు. అంత గొప్ప నటుడు అయినా.. సెట్లో ఎంత సాధారణంగా ఉండేవారంటే ఏ రోజునా ఆయనవల్ల వృథా జరగదు, జరగనివ్వరు. అక్కినేని నాగేశ్వరరావుగారు అంటే సొంత సోదరుడిలాగే చూసేవారు. కృష్ణ, శోభన్‌బాబులనూ బాగా ప్రోత్సహించారు. బాలకృష్ణ, చిరంజీవి పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారని ఆనందపడేవారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లగానే మా నిర్మాణ సంస్థ లోగోలో ఆయన కృష్ణుడి బొమ్మ పెట్టాం. వైజయంతీ మూవీస్ అంటే ఆయనే గుర్తుకు రావాలని!
- సి.అశ్వనీదత్ (ప్రముఖ నిర్మాత)
కలకాలం గుర్తుంచుకుంటారు
ఆయన బీఏ చదువుతుండగా దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ఎన్టీఆర్‌లోని సామర్థ్యాన్ని గుర్తించి సినిమాలో అవకాశం ఇస్తానంటే.. బీఏ పూర్తైన తర్వాతే అని సమాధానమిచ్చిన మంచి చదువరి నందమూరి. తర్వాత 45ఏళ్ల నటజీవితంలో 300కు పైగా చిత్రాల్లో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. భారత అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్‌కు పురస్కారం అందిస్తూ.. 'నేను భగవద్గీత చదువుతుంటే.. కృష్ణుడిగా నీ రూపమే కనిపిస్తుంది' అన్నారంటే ఆయన ముద్ర ఎలాంటిదో చెప్పవచ్చు. తెలుగు పరిశ్రమ అభివృద్ధి కోసం హిందీలో అవకాశాలొచ్చినా వదిలేసిన మహోన్నతుడు ఎన్టీఆర్. తెలుగుజాతికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన రామారావును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు.
- డా.కె.లక్ష్మీనారాయణ, సహరచయిత, యన్.టీ.ఆర్.సమగ్ర జీవిత కథ.
ఇదీ చూడండి: రాముడు, కృష్ణుడు.. ఏ పాత్ర అయినా గుర్తొచ్చేది ఆయనే