'ఫలానా తరహా సినిమా చేయాలని ప్రత్యేకంగా కలలేమీ లేవు. మనసుకు నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తా. అన్ని రకాల జానర్లు ప్రయత్నిస్తా' అన్నారు అజయ్ భూపతి. 'ఆర్‌ఎక్స్ 100' (RX 100 Movie) చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడాయన. ఇప్పుడు రెండో సినిమాగా శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా 'మహా సముద్రం' (Mahasamudram Movie) తెరకెక్కించారు. సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అజయ్ భూపతి. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'ఇద్దరు కథానాయకుల సినిమా అంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. 'దళపతి', 'విక్రమ్ వేదా' లాంటి మల్టీస్టారర్ చిత్రాలు చూస్తున్నప్పుడు ఓ తెలియని ఆనందం కలిగేది. అలాంటి అనుభూతిని.. ఆ కిక్‌ను ప్రేక్షకులకు అందివ్వాలనే 'మహా సముద్రం' (Mahasamudram Movie) చేశా. నిజానికి 'ఆర్‌ఎక్స్ 100' తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమానే పట్టాలెక్కించాలని బలంగా ప్రయత్నించా. 'ఆర్‌ఎక్స్ 100' (RX 100 Movie) కంటే ముందే నా దగ్గర ఈ కథాలోచన ఉంది. నా తర్వాతి సినిమాగా ఈ కథే చేస్తానని అప్పట్లో కార్తికేయకు చెబుతుండేవాడ్ని'.
సోలో హీరో అయితే చేస్తామన్నారు..
'మహా సముద్రం' (Mahasamudram Movie) పూర్తిగా కల్పిత కథతో రూపొందినదే. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల కథలా ఉంటుంది. వైజాగ్ నేపథ్యంలో సాగుతూ.. అక్కడి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా సాగుతుంది. ఈ కథ రాసుకున్నప్పుడు నేను ఏ హీరోని ఊహించుకోలేదు. ఇద్దరు కథానాయకుల కథ అనుకున్నానంతే. స్క్రిప్ట్ పూర్తయ్యాక కొందరు హీరోల దగ్గరికి వెళ్లా. కథ బాగా నచ్చిందన్నారు. కానీ, కొంత మంది సోలో హీరో అయితే చేస్తానన్నారు. నేను ఈ కథ ఇలాగే చేస్తానని పట్టుబట్టా. అలా చివరకు శర్వానంద్, సిద్ధార్థ్ ఓకే అయ్యారు'.
మహిళా పాత్రలే బలం..
'ఏ కథలోనైనా సరే మహిళా పాత్రలు బలంగా ఉంటే... కచ్చితంగా అది సక్సెస్ అవుతుందనేది నా ప్రగాఢ నమ్మకం. ఈ విషయంలో నాకు బాల చందర్ స్ఫూర్తి. అందుకే నా సినిమాల్లో నాయికా పాత్రలెప్పుడూ బలంగానే ఉంటాయి. వాళ్లనే కాదు.. నా చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రల్ని అసలు రాయను. ఇప్పుడీ చిత్రంలోనూ ప్రతి పాత్ర అలాగే బలంగా రాసుకున్నా. ప్రతి పాత్రకు ఆది.. అంతం ఉంటుంది. సినిమా చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ నా పాత్ర నిడివి ఎంత అని అడగలేదు. ప్రతిఒక్కరూ వచ్చి.. వాళ్ల వాళ్ల పాత్రలకు న్యాయం చేసి వెళ్లారు. ఇది ఇంత బాగా రావడానికి కారణమదే'.
సమంతని అనుకున్నా...
'మహా అనే పాత్ర చుట్టూ అల్లుకున్న కథ ఇది. స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఆ పాత్రకు సమంతతో పాటు మరో నలుగురు నాయికల్ని అనుకున్నా. వాళ్లలో అదితి రావు హైదరి (Aditi Rao Hydari New Movie) ఒకరు. నేను మొదట కథ చెప్పింది ఆమెకే. అదృష్టవశాత్తూ.. ఆమె విన్న వెంటనే ఓకే చెప్పింది. దీంతో తనతోనే ముందుకెళ్లా. నా దృష్టిలో ప్రేమకు హద్దుల్లేవు. నీ మీద నీకెంత ప్రేమ అంటే.. ఇంత అని కచ్చితంగా చెప్పలేం. అసలు ఆ ప్రేమను కొలవలేం. ఒక్కోసారి ప్రేమించిన వారికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే ఈ చిత్రానికి కొలవలేనంత ప్రేమ అని క్యాప్షన్ పెట్టా. స్నేహితులంటే నాలుగు రోజులు కలిసి తిరిగి, బీర్లు తాగి వెళ్లడం కాదు. ఒక్కసారి మన ఫ్రెండ్ అనుకుంటే.. వాడు చేసే తప్పుల్ని, ఒప్పుల్ని అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలి. ఈ విషయాలన్నీ ఈ చిత్రంలో చూపించాం'.
'ఆర్‌ఎక్స్ 100' హిందీ రీమేక్‌కి అడిగారు..
'దర్శకుడు కావాలన్నదే నా కల. తొలి చిత్రంతోనే ఆ కల నెరవేరింది. అప్పట్లో నేను అది హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని నేనెప్పుడూ ఆలోచించలేదు. నేను దర్శకుడ్ని అయ్యానన్న సంతోషమే ఉండేది. 'ఆర్‌ఎక్స్ 100' (RX 100 Movie) బాలీవుడ్ రీమేక్ కోసం నన్ను సంప్రదించారు. నాకు బాలీవుడ్‌లో చేయాలన్న ఆసక్తి లేదు. నాకిక్కడ చాలా బాగుంది. తెలియని వాళ్ల దగ్గరకి వెళ్లి సినిమా చేయాలని ఎప్పుడూ అనిపించలేదు. భవిష్యత్తు గురించి అంటారా.. అదిప్పుడే చెప్పలేను. నాకు ఓటీటీ అంటే ఇష్టమే. థియేటర్లలో చూపించలేని ఐడియాని ఓటీటీలో మరింత విస్తృతంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నేను నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ ఆంథాలజీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. నా తర్వాతి సినిమా ఓ మాస్ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. స్క్రిప్ట్ సిద్ధమైంది. హీరో ఇంకా ఖరారు కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. తర్వలో అన్ని వివరాలు ప్రకటిస్తా'.
ఇదీ చూడండి: 'పుష్ప' సాంగ్ ప్రోమో.. 'రక్షాబంధన్' షూటింగ్ పూర్తి