కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ స్పందించారు. ఎస్పీబీ ఆరోగ్యంపై ఓ తమిళ వార్తా ఛానల్‌లో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. ఆయన ఆరోగ్యం విషమించినప్పటికీ.. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు.
తన తండ్రి త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీబీ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
మన ప్రార్థనలే అన్నయ్యకు అండ: సోదరి
ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆయన సోదరి ఎస్పీ వసంత తెలిపారు. చరణ్‌తో తాను ఇప్పుడే మాట్లాడానని, ఎవరూ కంగారుపడొద్దని విజ్ఞప్తి చేశారు. అందరి ప్రార్థనలు ఫలిస్తాయని, భగవంతుడి ఆశీస్సులతో ఆయన తప్పకుండా ఇంటికి వస్తారని చెప్పారు. మనందరి ప్రార్థనలే ఆయనకు కొండంత అండగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకడం వల్ల ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలు ఆరోగ్యం పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలని ఆకాంక్షిస్తూ.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.