ఒక ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాల్ని మరో భాషలో రీమేక్ చేయడం సాధారణమైన విషయమే. మొదట్లో 80,90 దశకాల్లో హాలీవుడ్ కానీ ఇంకే భాషలోనైనా కథ బాగుంటే దానికే కాస్త మెరుగులు దిద్ది కొత్త సినిమాగా రూపొందించేవారు. అది అనధికారిక రీమేక్‌గా ఉండేది. కానీ మీడియా విస్తృతి పెరగడం, డిజిటల్ మాధ్యమాల ప్రభావం, న్యాయపరమైన చిక్కుల వల్ల ఒరిజినల్ కథలను రీమేక్ చేయాలంటే వాటి హక్కులు దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా రీమేక్ అయిన చిత్రాల్లో ఒరిజినల్ కథను తెరకెక్కించిన దర్శకులే మళ్లీ వేరే భాషలో రీమేక్‌లను పట్టాలెక్కించిన వారు ఉన్నారు. అలా బాలీవుడ్లో రీమేక్ అయిన చిత్రాలకు పని చేసిన దక్షిణాది దర్శకులెవరో చూద్దాం.
దుర్గామతి (2020)
అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వం వహించిన చిత్రం 'భాగమతి'. ఈ చిత్రం ఇటీవలే హిందీలో రీమేక్ అయింది. దీనికీ అశోక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం హిందీలో మాత్రం అలరించలేకపోయింది.
లక్ష్మీ (2020)
రాఘవ లారెన్స్‌కు ఎంతగానో పేరు తెచ్చిన చిత్రాల్లో 'కాంచన' ఫ్రాంచైజీ ఒకటి. ఇదే చిత్రాన్ని ఇటీవల 'లక్ష్మీ' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు లారెన్స్. అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. కానీ బాలీవుడ్లో ఈ సినిమా సత్తాచాటలేకపోయింది.
కబీర్ సింగ్ (2019)
టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు సందీప్ రెడ్డి. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలోనూ ఘనవిజయం సాధించింది.
ప్రస్థానం (2019)
టాలీవుడ్లో విడుదలైన 'ప్రస్థానం' (2010) చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇక్కడ దర్శకత్వం వహించిన దేవాకట్టానే హిందీలోనూ రూపొందించారు. ఇందులో సంజయ్ దత్, మనీషా కోయిరాల, జాకీ ష్రాఫ్, అలీ ఫజల్, సత్యజిత్ దూబే, అమైరా దస్తూర్, చుంకీ పాండే ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రామయ్యా వస్తావయ్యా (2013)
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005). ఈ చిత్రాన్ని బాలీవుడ్లో 'రామయ్యా వస్తావయ్యా' (2013)గా రీమేక్ చేశారు ప్రభుదేవా. ఇందులో గిరీశ్ తౌరానీ, శ్రుతీ హాసన్ లీడ్ రోల్స్ చేశారు. ఇందులోని పాటలకు మంచి ప్రేక్షాదరణ లభించినా.. అది సినిమా విజయానికి దోహదపడలేకపోయింది.
షార్ట్ కట్ రోమియో (2013)
2006లో కోలీవుడ్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం 'తిరుట్టు పాయలే'. సుసి గణేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2013లో హిందీలో రీమేక్ చేశారు సుసి. నీల్ నితీశ్ ముకేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ డిజాస్టర్‌గా నిలిచింది.
బాడీగార్డ్ (2011)
2010లో మలయాళంలో తెరకెక్కిన 'బాడీగార్డ్' చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు సిద్దికీ. మలయాళంలోనూ ఈయనే రూపొందించారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.