26/11 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. యువ నటుడు అడివి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఆరు భారీ సెట్లను తీర్చిదిద్దాడు ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా.
ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా, ఎన్‌ఎస్‌జీ కమాండో తదితర సెట్లని హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో రూపొందించారు. ముంబయి తాజ్ హోటల్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌కి సంబంధించి కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాలనుకున్నా అనుమతి దొరకకపోవడం వల్ల తాజ్ హోటల్ సెట్‌నీ ఇక్కడే తీర్చిదిద్దారు. 500 మంది సుమారు 10 రోజులు శ్రమించి ఈ భారీ సెట్‌ని నిర్మించారు.
"మేజర్' సినిమా కోసం ఆరు భారీ సెట్లు వేశాం. మా బృందం ప్రతి సెట్‌ని ఎంతో శోధించి తీర్చిదిద్దింది. తాజ్ ప్యాలెస్ సెట్ కోసం ఎక్కువ కష్టపడ్డాం. కథలో కీలకంగా నిలిచే తాజ్ హోటల్ గురించి శేష్ వివరించారు. ఇదొక స్థలం కాకుండా ఓ పాత్రలా ఊహించుకోమన్నారు. అలా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని వాస్తవానికి దగ్గరగా ఉండేలా వాటిని తీర్చిదిద్దాం. 120 అడుగుల ఎత్తులో.. ఐదు అంతస్తుల హోటల్ సెట్ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి పంచుతుంది."
-అవినాశ్ కొల్లా, ఆర్ట్ డైరెక్టర్
ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టెన్‌మెంట్స్,ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.