ప్రముఖ తమిళ నటుడు శింబు ఓ పాత్ర కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడూ రొమాంటిక్, స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చే ఆయన తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తదుపరి చిత్రం 'వెందు తనిందదు కాడు' కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. వెల్స్ ఇంటర్నేషనల్ పతాకంపై డాక్టర్ ఇషారీ కె. గణేశ్ నిర్మిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఫస్ట్‌లుక్ అదుర్స్..
తాజాగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో లుంగీ ధరించి, కర్రపట్టుకుని అమాయకంగా కనిపించారు శింబు. అతని వెనక ప్రాంతంలో మంటలు చెలరేగుతుంటాయి. 'వెందు తనిందదు కాడు' అంటే కాలి బూడిదైన అడవి అని అర్థం. దీన్ని బట్టి చూస్తుంటే అడవి నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతుంది. గౌతమ్- శింబు కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన క్లాసికల్ ప్రేమకథ 'విన్నైతాండి వరువాయా' (ఏమాయ చేశావే) సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు తమ కొత్త చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. నాయిక, చిత్రీకరణ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
'వల్లభ', 'మన్మథ' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శింబు. కొన్ని తెలుగు పాటలతో గాయకుడిగానూ అలరించారు.
ఇదీ చదవండి: 'ఆ కసి, కోపంతోనే 'రన్ రాజా రన్' స్టోరీ రాశా'