బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి సోదరుడు షౌవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్‌గా పనిచేసిన శామ్యూల్ మిరండాను ఎన్‌సీబీ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
తొలుత వీరి నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం సుదీర్ఘంగా విచారించారు. జుహూలోని రియా నివాసంలోకి వచ్చిన ఎనిమిది మంది అధికారుల బృందం సోదాలు జరిపింది. ఆ సమయంలో రియాతో పాటు షౌవిక్, వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు.
ఇటీవల రియా చక్రవర్తిని విచారించిన సందర్భంలో ఆమె ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు.. రియా వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. డ్రగ్స్ అంశంపై సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోదీతో పాటు మరికొందరితో వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ ఆగస్టు 26న కేసు నమోదు చేసింది. అనంతరం రియా చక్రవర్తి, షౌవిక్ చక్రవర్తి, తదితరులపై కేసులు నమోదు చేసిన ఆ సంస్థ.. ఆగస్టు 27న దర్యాప్తు ప్రారంభించింది. కాగా ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.