రైతును గౌరవించని రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లు చరిత్రలోనే లేదని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. ప్రతి పౌరుడు రైతును గౌరవించాలని, వీలైతే పూజించాలన్నారు. యువ దర్శకుడు కిశోర్ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన 'శ్రీకారం' చిత్రానికి బుర్ర సాయిమాధవ్ మాటలు అందించారు. క్లీన్ యూ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలవుతున్న నేపథ్యంలో ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
వ్యవసాయ ఆధారిత దేశంలో యువత వ్యవసాయం వైపు ఎందుకు మొగ్గుచూపాలో తెలిపే చక్కటి కథాంశంతో శ్రీకారం ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. దర్శకుడు చెప్పిన కథ స్ఫూర్తితోనే తాను ఈ చిత్రానికి మాటలు రాసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్న సాయిమాధవ్.. 'శ్రీకారం' సినిమా చూశాక ప్రతి ఒక్కరు రైతు గురించి ఆలోచిస్తారని, రైతు కావాలన్న కాంక్ష మనసులో కలుగుతుందన్నారు.
సినీరంగంలో మాటల రచయితల స్థాయిని పరిచూరి సోదరులు సుస్థిరం చేస్తే త్రివిక్రమ్ లాంటి దర్శకులు మరో స్థాయిలో నిలబెట్టారన్నారు. అలాంటి దర్శకుడు త్రివిక్రమ్‌కు 'శ్రీకారం'లో సంభాషణలు నచ్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 'మళ్లీమళ్లీ రానిరోజు' తర్వాత శర్వానంద్‌తో కలిసి పనిచేయడం సంతోషానిచ్చిందన్నారు.
ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో పాటు పవన్ కల్యాణ్- క్రిష్ సినిమా, నాగ్ అశ్విన్- ప్రభాస్ సినిమా, గుణశేఖర్ 'శాకుంతలం' చిత్రాలకు మాటలు అందిస్తున్న బుర్రా సాయిమాధవ్ మరో రెండు చిత్రాల్లో మాటలు రాసే అవకాశాన్ని పొందారు.
ఇదీ చూడండి: స్ఫూర్తినిస్తున్న 'శ్రీకారం' పాట.. యష్ 'గజకేసరి' టీజర్