డ్రగ్స్ సరఫరా, విక్రయ కేసులో కారాగారంలో ఉన్న కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ బెయిల్ పిటిషన్ విచారణ గురువారానికి వాయిదా పడింది. సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని ప్రత్యేక న్యాయస్థానంలో మొదట రాగిణి, అనంతరం సంజన అర్జీలు విచారణకు వచ్చాయి. సంజన జామీనుకు ఆక్షేపణలను దాఖలు చేసేందుకు సమయం కావాలని సీసీబీ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
సిగరెట్లు మాత్రమే దొరికాయి
"రాగిణిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదు. ఆమె నివాసంలో సిగరెట్లు మాత్రమే దొరికాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు లేవు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఓ నిందితుడు చేసిన ఆరోపణల ఆధారంగానే రాగిణిని అరెస్టు చేశారు. ఆమె తండ్రి మాజీ సైనిక అధికారి. కొవిడ్ సమయంలో పేదలు, వలస కార్మికులకు మద్దతుగా నిలిచారు. గతంలో సీసీబీ నిర్వహించిన పలు జాగృతి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు" అని రాగిణి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
విచారణలో సహకరించలేదు
"రాగిణి మాదక ద్రవ్యాలను విక్రయించిన ఆధారాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రముఖ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. స్వాధీనపరుచుకున్న చరవాణికి పాస్ వర్డ్‌ను చెప్పలేదు. సాంకేతిక నిపుణుల సహకారంతో దాన్ని ఓపెన్ చేయగలిగాం. ఆమె వైద్య పరీక్షలకు సహకరించలేదు. మూత్ర పరీక్షల వేళ.. నీరు కలిపి ఇచ్చారు" అని సీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
తప్పించుకునే అవకాశం
ఐదేళ్లుగా ఆమె పలు పార్టీల్లో ఇతర నిందితులతో కలిపి పాల్గొన్నారని సీసీబీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. "ఈ కేసులో ఆమెకు కనీసం 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. తక్షణమే జామీను మంజూరు చేస్తే తదుపరి విచారణ కష్టమవుతుంది. ఆమె తప్పించుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయి" అని తమ వాదనల్లో పేర్కొన్నారు. మరిన్ని ఆక్షేపణలకు అవకాశం ఇస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.