పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లానాయక్'. అహం, ఆత్మాభిమానం.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానాకు జోడీగా ఎవరు నటించనున్నారనే విషయంపై గత కొన్నిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. మొదట ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించగా.. ఇటీవల మలయాళీ నటి సంయుక్త మేనన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఆ చర్చలన్నింటికీ చిత్రబృందం తెరదించింది. సంయుక్త మేనన్‌నే రానాకు జోడీగా ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ‘భీమ్లానాయక్’ కుటుంబంలోకి సంయుక్తకు స్వాగతం తెలుపుతూ చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఈమేరకు ఇందులో ఆమె రానాకు సతీమణి పాత్రలో కనిపించనున్నారు.
మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా 'భీమ్లానాయక్' సిద్ధమవుతోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్.. భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా.. డేనియల్ శేఖర్‌గా అలరించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్పెషల్ వీడియోలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.
ఇదీ చూడండి: RRR movie: 'ఆర్ఆర్ఆర్' నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇదేనా?