కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో సినీ నటులు తమకు తోచిన సాయం చేసి ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ భాయీ జాన్జ్ కిచెన్ రెస్టారెంట్ ద్వారా పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు, కంటైన్‌మెంట్ జోన్‌లలో ఉన్నవాళ్లకు ఆహారాన్ని అందిస్తున్నారు.
సల్మాన్ ఖాన్, యువ సేన నాయకుడు రాహుల్ కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రోజుకు 5000 మందికి ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. బాంద్రాలోని భాయి జాన్జ్ కిచెన్‌ను ఏర్పాటు చేసి 'బీయింగ్ హంగ్రీ' పేరుతో ఉన్న వ్యాన్ల ద్వారా ముంబయి అంతటా అవసరమైన వాళ్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
సోమవారం భాయీ జాన్జ్ కిచెన్ రెస్టారెంట్‌ను సందర్శించి ఆహార నాణ్యతను సల్మాన్ ఖాన్ పరిశీలించారు. ప్యాకెట్స్‌లో భోజనం, బిస్కెట్లు, వాటర్ బాటిల్‌తో పాటు చికెన్ నగ్గెట్స్, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, విటమిన్ సి అధికంగా ఉండే జ్యూస్‌లు అందించాలని సల్మాన్ ఖాన్ సూచించారు.