బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ దాతృత్వం చాటుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 25 వేలమంది సినీ కార్మికులకు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు.
సల్మాన్‌ఖాన్ నుంచి గురువారం రాత్రి, ఈ విషయమై తమకు కాల్ వచ్చిందని తివారీ చెప్పారు. సినీ కార్మికులకు నెలకు రూ.1500 చొప్పున ఆయన ఇవ్వనున్నారని అన్నారు. అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసి సల్మాన్‌కు పంపిస్తామని తివారీ తెలిపారు.
మే 13న విడుదల కానున్న 'రాధే' సినిమాకు వచ్చే ఆదాయం కూడా సినీ కార్మికుల కోసం ఉపయోగిస్తామని ఇప్పటికే సల్మాన్‌ఖాన్ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఆర్ధిక సహాయం చేస్తాననడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా తమ రాష్ట్రంలోని సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లపై మహారాష్ట్ర సర్కారు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ కారణంగా చాలామంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు.