"55ఏళ్ల వయసులోనూ భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటారు.. రిస్క్ అనిపించదా?" అని సల్మాన్‌ను అడిగితే.. "నాకు అలాంటి సినిమాలంటేనే ఇష్టం. నా అభిమానులు నన్ను అలానే చూడటానికి ఇష్టపడతారు. అందుకే నాకు అవి రిస్క్ అనిపించవు" అంటున్నారు. ఆయన నటించిన 'రాధే' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన జూమ్‌లో మీడియాతో మాట్లాడారు.
"ఈ సినిమా 'వాంటెడ్'కు సీక్వెల్ కాదు. ఇది ఓ సరికొత్త కథతో రూపొందింది. నా పాత్ర పోలీసు అధికారి కావడం వల్ల అందరూ 'వాంటెడ్'కు కొనసాగింపు చిత్రమేమో అనుకుంటున్నారు. ముంబయిలోని డ్రగ్స్ మాఫియా ఆటకట్టించే పోలీస్ పాత్రలో నేను కనిపిస్తా. ఇప్పటికే విడుదలైన సీటీమార్, జూమ్‌జూమ్ పాటలు యువతను ఆకట్టుకున్నాయి. సినిమా అందర్నీ మెప్పిస్తుంది" అన్నారు. "ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా?" అని అడిగితే.. ‘"అందాజ్ అప్నా అప్నా 2' తీయాలనుంది. దీనికి మంచి స్క్రిప్ట్ దొరకాలి. దొరికితే.. నేను, ఆమిర్‌ఖాన్ కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నా" మని తెలిపారు.