డార్లింగ్ ప్రభాస్ కొత్త చిత్రం 'ఆదిపురుష్'లోని తన పాత్రపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవలే ఓ కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని శనివారం ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు సైఫ్. తన మాటలతో ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని ఈ సందర్భంగా కోరాడు.
సోషల్‌మీడియాలో శనివారం ఓ వెబ్లాయిడ్లో పాల్గొన్న సైఫ్ అలీఖాన్.. 'ఆదిపురుష్'లో తన పాత్ర లంకేశ్‌పై మాట్లాడాడు. రావణాసురుడిని సమర్థిస్తూ సైఫ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపిన సైఫ్.. నెటిజన్లకు క్షమాపణలు తెలియజేశాడు.
"ఆ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలపై అవగాహన ఉంది. కానీ, వాటి కారణంగా కొంతమంది మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ వివాదం చెలరేగింది. వాళ్లను నొప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ, నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. నా దృష్టిలో రాముడు అంటే ధర్మానికి, హీరోయిజానికి ప్రతీక. రాక్షసులపై విజయం సాధించడమే 'ఆదిపురుష్' కథాంశం. ఈ కథలో ఎలాంటి వక్రీకరణలు లేకుండా రూపొందించడానికి చిత్రబృందం కృషి చేస్తోంది."
- సైఫ్ అలీఖాన్, బాలీవుడ్ నటుడు
ఈ చిత్రంలో లంకేశ్ పాత్రలో సైఫ్ నటించనున్నాడని చిత్రబృందం ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. అయితే కొన్ని కారణాలతో సైఫ్ అలీఖాన్‌ను ఇందులో నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.