Pawankalyan bheemlanayak director: "భీమ్లానాయక్ సినిమాతో ఎంత పేరు వచ్చిందో నాకు అది చాలు, త్రివిక్రమ్ సలహాలు.. సహకారం వల్లే ‘భీమ్లానాయక్’ ఇలా రూపుదిద్దుకోవడానికి కారణమైంది" అని దర్శకుడు సాగర్ కె. చంద్ర చెబుతున్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూర్చారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సాగర్ కె.చంద్ర పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"చేసిన మూడు సినిమాల్లో ఒకొక్కటి ఒక్కో రకమైన అనుభవాన్నిచ్చాయి. ‘భీమ్లానాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప నాకు మరేమీ తెలియదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సమయానికి పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన ఏర్పడింది. ‘భీమ్లానాయక్’ అయితే మరిన్ని విషయాల్ని నేర్పించింది. మనం కథల్ని ఎంతగా సొంతం చేసుకుని తీశామన్నది కీలకం. ఒక విజయం తర్వాత ‘తెలిసినవాళ్లు తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నార’ని చాలామంది చెప్పడం విన్నాను. వీళ్ల నంబర్ జనాలకి ఎలా తెలుస్తుందని నవ్వుకునేవాడిని. దాని వెనక లాజిక్ నాకు ఈ సినిమాతో తెలిసిపోయింది. మన ఫోన్ నంబర్లు ఎలాగోలా వెళ్లిపోతాయంతే (నవ్వుతూ). చాలా మంది అభిమానులు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. ఇక పరిశ్రమ నుంచైతే సుకుమార్, హరీష్‌శంకర్, సురేందర్‌రెడ్డి, క్రిష్ దర్శకులంతా ‘కమర్షియల్ హిట్ కొట్టావ్’ అని ప్రశంసించారు. ఆ మాటలు నాకో మంచి జ్ఞాపకం’"
- " class="align-text-top noRightClick twitterSection" data="">
‘‘నిర్మాత వంశీవల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇందులో పవన్‌కల్యాణ్, రానా కథానాయకులుగా రావడంతో మరింత ఆత్రుతగా అనిపించింది. పవన్‌కల్యాణ్ పేరు వినిపించగానే ఓ గొప్ప అనుభూతి కలిగింది. ‘వకీల్‌సాబ్’ సెట్లో ఉన్నప్పుడు వెళ్లి తొలిసారి ఈ సినిమాకోసమే కలిశా. ‘బాగా తీయ్... బాధ్యతగా పనిచేయ్’ అని చెప్పారు. త్రివిక్రమ్‌తో ప్రయాణం ప్రారంభమయ్యాక మొదట మలయాళంలోని కోషి పాత్రని భీమ్లాగా ఎలా మార్చాలనే విషయం గురించే చర్చ మొదలైంది. ‘సాగర్ ఇది రీమేక్ అనే విషయాన్ని మన మనసులో నుంచి తీసేసి చేద్దాం, ఎంతగా అంటే దీని రీమేక్ హక్కుల్ని మరొకరు తీసుకోవాలనేంతగా మనం మారుద్దాం’ అన్నారు. ఆయన ఆ రోజు చెప్పిన మాటకి తగ్గట్టే అందరం పనిచేశాం. దీన్ని ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అనడం కంటే అలాంటి సినిమా అంటే బాగుంటుందేమో! మాతృకలో చాలా చోట్ల కథ ముందుకు సాగకుండా ఆగిపోతుంది. అలాంటి సన్నివేశాలు మన ప్రేక్షకులకి నచ్చవు. అలాంటి చోట్ల మార్పులు చేసి సినిమా తీశాం. యాక్షన్ కంటే భావోద్వేగాలే ఇందులో ఎక్కువగా పండాయి. అదే ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది’’.
‘‘14 రీల్స్ ప్లస్ సంస్థతో కలిసి వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ఓ ప్రాజెక్ట్‌ని ప్రకటించా. నిర్మాణ వ్యయం అధికం అయ్యే పరిస్థితి కనిపించడంతో అలా పక్కనపెట్టాం. మరి తదుపరి అదే కథనే చేస్తానా లేక, మరొకటా అనేది త్వరలోనే నిర్ణయిస్తా. సితార సంస్థలోనూ మరో సినిమాకు ప్రణాళికలున్నాయి’’.
- సాగర్ కె. చంద్ర
ఇదీ చదవండి: Prabhas Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది