ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని కథానాయిక శ్రియ తెలిపింది. రాజమౌళి ఓ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని వెల్లడించింది.
"నాది ఇందులో అతిథి పాత్ర మాత్రమే. ‘ఛత్రపతి’ (2005) తర్వాత మరోసారి రాజమౌళితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా అనిపించింది. ఆయనకు అద్భుతమైన విజన్ ఉంది. ఎంతో విభిన్నంగా ఈ సినిమాను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సెట్‌లో ఉన్నంత సేపు నేను ఓ ప్రత్యేకమైన చిత్రంలో భాగం కాబోతున్నా అనే ఫీలింగ్‌లో ఉన్నా. ఈ కరోనా ప్రభావం తగ్గిన వెంటనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అప్పుడు సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా. నేను అజయ్ దేవగణ్‌తో కనిపిస్తా. ఆయన గొప్ప నటుడు. అజయ్‌తో నటన ఓ మంచి అనుభవం. కానీ తారక్, చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. వాళ్లిద్దరు తెరపై చక్కగా ఉంటారని మాత్రం చెప్పగలను."
-శ్రియ, హీరోయిన్.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్ కథానాయిక. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'అంధాధున్' తెలుగు రీమేక్‌లో నటి టబు పాత్రలో శ్రియ కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా దీని గురించీ స్పందించింది శ్రియ.
"అవును. నన్ను ఆ సినిమా కోసం సంప్రదించారు. చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి, థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియదు. నేను నా భర్తతో కలిసి బార్సిలోనాలో ఉంటున్నా. షూటింగ్స్ తిరిగి ప్రారంభమైతే ఇండియాకు తిరిగి రావాలి. కాబట్టి జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ ప్రాజెక్టు ఖరారైతే.. టబు పాత్రలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తా. ఆమె నటించిన అన్నీ చిత్రాలు నేను చూశా, స్ఫూర్తి పొందా. కానీ ఆమెను ఇమిటేట్ చేయకుండా, నా తరహాలో నటిస్తా" అని వెల్లడించింది శ్రియ.
ఇదీ చూడండి 'దొరసాని' ముద్దుగుమ్మ హాట్ లుక్స్