రాబర్ట్ డౌనీ జూనియర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. అదే ఐరన్ మ్యాన్ అంటే చాలామంది గుర్తుపట్టేస్తారు. తాజాగా అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన డిస్నీ డీ23 ఎక్స్పో-2019లో ప్రతిష్టాత్మక డీస్నీ లెజెండ్ అవార్డును దక్కించుకున్నాడీ హీరో. మొదటిసారి డిస్నీల్యాండ్‌కు వచ్చినపుడు అరెస్టు అయ్యానని, ఇప్పుడు అవార్డు తీసుకుంటున్నానని తన మనసులో మాట పంచుకున్నాడు.
"డిస్నీ లెజెండ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మీతో ఓ విషయాన్ని పంచుకుందామనుకుంటున్నా. నేను మొదటిసారి డిస్నీల్యాండ్ వచ్చినపుడు అరెస్ట్ అయ్యాను. అనుమతి లేకుండా బోట్లో పొగ తాగినందుకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో చాలా అవమానకరంగా అనిపించింది.. ఎంతో నిరుత్సాహపడ్డాను" -రాబర్ట్‌డౌనీ జూనియర్, హాలీవుడ్ నటుడు.
ఐరన్‌మ్యాన్, అవెంజర్స్ ఫిల్మ్‌సిరీస్‌తో రాబర్ట్ ఎంతో గుర్తింపు పొందాడు. దశాబ్ద కాలంగా మార్వెల్ సూపర్‌హీరో పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించాడు.
ఈ గౌరవం దక్కడం తనకు మర్చిపోలేని బహుమతి అని తెలిపాడు రాబర్ట్ డౌనీ జూనియర్. "ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు.. ఐ లవ్యూ 3000.. నేనే ఐరన్ మ్యాన్" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు ఐరన్‌మ్యాన్, జంగిల్‌బుక్ దర్శకుడు జాన్ ఫేవరూ, జేమ్స్ ఎరల్ జోన్స్, ప్రముఖ గాయకురాలు క్రిస్టినా అగ్విలేరా తదితరులకు డిస్నీ లెజెండ్ పురస్కారాలు దక్కాయి.
"నన్ను ఈ పురస్కారానికి ఎంపికచేసినందుకు కృతజ్ఞతలు. రాబోయే తరాల వారికి కూడా గుర్తుండిపోయే కథలతో, సాంకేతికతతో డిస్నీ మాయ చేసింది. విభిన్న కథలతో ముందుకొచ్చిన ఎంతో మందికి అవకాశం కల్పించింది. " -జాన్ ఫేవరూ, హాలీవుడ్ దర్శకుడు.
ఈ ఏడాది లయన్‌కింగ్ సినిమాతో ప్రేక్షకులని అలరించాడు జాన్. 1994లో వచ్చిన చిత్రాన్ని అదే పేరుతో లైవ్ యాక్షన్‌గా రీమేక్‌గా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇది చదవండి: 'మహాభారతం'లో ప్రభాస్ ఈ పాత్ర చేస్తాడట..!