బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని మీడియా వెంటాడుతోందని, ఇది సరైన పద్ధతి కాదని బాలీవుడ్‌కు చెందిన 2,500 మంది ఓ లేఖను విడుదల చేశారు. భారత్‌లోని న్యూస్ మీడియాను ఉద్దేశిస్తూ.. సోనమ్ కపూర్, జోయా అక్తర్, గౌరీ షిండే, అనురాగ్ కశ్యప్, అదితి మిట్టల్‌తోపాటు 2500 మంది బాలీవుడ్‌కు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, 60 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు లేఖపై సంతకం చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా డ్రగ్ కేసులో జైలుకు వెళ్లింది. ఈ కేసును కవర్ చేస్తున్న క్రమంలో మీడియా రియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వీరంతా లేఖలో పేర్కొన్నారు. కొన్ని మీడియా సెక్షన్లు రియాను, ఆమె కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
"మేమంతా నీ గురించి బాధపడుతున్నాం.. నువ్వు బాగానే ఉన్నావా?" అంటూ న్యూస్ మీడియా ఆఫ్ ఇండియాను అడుగుతున్నట్లు లేఖలో రాశారు. నువ్వు ప్రత్యేకమని మాకు తెలుసు.. ఎందుకంటే సల్మాన్ ఖాన్ (కృష్ణ జింకల్ని వేటాడిన కేసును ఉద్దేశిస్తూ..), సంజయ్ దత్ (1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో హస్తం ఉందని సుప్రీమ్ కోర్టు తేల్చడం వల్ల ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించారు) విషయాల్లో వారి కుటుంబ సభ్యులు, అభిమానుల గురించి ఆలోచించి దయ, గౌరవంతో వ్యవహరించావు. కానీ నేరం చేసిందని ఇంకా నిరూపించబడని ఓ యువతి క్యారెక్టర్‌ను నాశనం చేశావు. ఆమె, కుటుంబ సభ్యుల్ని తప్పుపట్టే రీతిలో జనాల్ని ప్రేరేపించావు. తప్పుడు డిమాండ్లకు ఆజ్యం పోశావు. సామాజిక దూరం అనే విషయాన్ని విస్మరించి, మీ ప్రతినిధులు రియాను గుమిగూడారు. నిర్విరామంగా ఆమె ప్రైవసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తప్పుడు ఆరోపణలపై ఓవర్‌టైమ్ పని చేస్తున్నారు. రియా కో ఫసావో (రియాను ఇరికించడం) అనే డ్రామాకు తోడ్పడుతున్నారు." అని బహిరంగ లేఖలో ప్రముఖులు మీడియా వైఖరిని తప్పుబట్టారు.
బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా రియా పట్ల మీడియా ప్రవర్తిస్తున్న తీరును ఖండించారు. మీడియా సర్కస్‌ని ఆపాలని, రియాకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.