హిట్లు, ఫ్లాపులు సినీ పరిశ్రమలో సర్వసాధారణం. జయాపజయాలను రుచి చూడకుండా చిత్రసీమలో ముందుకు సాగడం కాస్త కష్టమే. ఏడాదికి ఒక్క హిట్ వస్తే చాలు అనుకునే మన హీరోలలో కొందరు 2019లో ఒకటి కాదు రెండేసి విజయాలను ఖాతాలో వేసుకున్నారు. మరి వారెవరో ఇప్పుడే చూసేద్దాం!
ఆరంభం.. ముగింపు 'వెంకీమామ'దే..
ఈ ఏడాదిని 'ఎఫ్2' చిత్రంతో చిరునవ్వుల సందడుల మధ్య విజయవంతంగా షురూ చేశాడు విక్టరీ వెంకటేష్. యువ హీరో వరుణ్ తేజ్‌తో కలిసి సంక్రాంతి అల్లుళ్లుగా తెరపైకి వచ్చిన వెంకీ.. చాలా రోజుల తర్వాత తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లో నవ్వుల జల్లులు కురిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అసలు సిసలు సంక్రాంతి చిత్రమనిపించుకుంది.
ఇక ఏడాది చివరికి వచ్చే నాటికి వెంకీలో ఈ జోష్ మరింత పెరిగింది. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి చేసిన ‘వెంకీమామ’ బాక్సాఫీస్ ముందు చక్కటి విజయాన్ని అందుకొంది. వెంకీ ఈ సంవత్సరాన్ని హిట్‌తో ప్రారంభించి.. అంతే విజయవంతంగా ముగించి 2019కి హీరోగా నిలిచాడు. వెంకీతో కలిసి తెర పంచుకున్న వరుణ్ తేజ్, నాగచైతన్యలు కూడా ఈ ఏడాది వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకోవడం విశేషం.
ఈ ఏడాది బెస్ట్ కపుల్..
నాగచైతన్య - సమంతలకు ఈ సంవత్సరం నిజంగా ఓ మధుర జ్ఞాపకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరూ 'మజిలీ' చిత్రంతోనే 2019ని విజయవంతంగా ప్రారంభించారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం వల్ల ఈ విజయం చైతూ - సామ్‌ల జంటకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం సమంత చేసిన ‘ఓ బేబీ’ బాక్సాఫీస్ ముందు అద్భుత విజయాన్ని అందుకోవడం.. తాజాగా చైతూ కూడా 'వెంకీమామ'తో కలిసి మరో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకోడం.. ఈ ఆలుమగల కెరీర్‌లో ఈ ఏడాదిని ఓ మైలురాయిగా చెప్పవచ్చు. అందుకే ఈ సంవత్సరంలో చెరో రెండు విజయాలు ఖాతాలో వేసుకున్న ఈ భార్యభర్తల్ని 2019 బెస్ట్ కపుల్ అనొచ్చు.
వరుస విజయాల పండగలో..
మెగా మేనల్లుడు సాయితేజ్ ఈ ఏడాది 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' రూపంలో విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా 'చిత్రలహరి' విషయానికొస్తే.. ఈ సినిమా ముందు వరకు సాయిధరమ్ తేజ్ చేసిన అరడజను చిత్రాలు బాక్సాఫీస్ ముందు దారుణ ఫలితాల్ని అందుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొక్క పరాజయం పడితే తన కెరీర్ ముగిసినట్లే అనుకున్న తరుణంలో కిషోర్ తిరుమల ఓ ఫెయిల్యూర్ జీవితకథతో తేజుకి అద్భుత విజయాన్ని అందించాడు. ఈ చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితోనే మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' చేయగా.. ఈ ఏడాదికి అది పండగలాంటి విజయాన్ని అందించి చక్కటి వీడ్కోలను పలికింది.
ఈ ఏడాదికి మెగా విలన్..
వెంకీ, చైతూ, తేజుల్లాగే వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది రెండు విజయాలతో సత్తా చాటాడు. ఏడాది ఆరంభంలో 'ఎఫ్2' విజయంలో ముఖ్య భూమిక పోషించగా.. ద్వితియార్థంలో 'గద్దలకొండ గణేష్'గా మారి బాక్సాఫీస్‌ను గజగజ వణికించాడు. ముఖ్యంగా ‘గద్దలకొండ’ చిత్రం కోసం ప్రతినాయకుడిగా ఆయన చేసిన సాహసం.. ఆ పాత్రలో అతడు చూపించిన అభినయం నేటితరం కుర్రహీరోలని విస్మయ పరిచింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో కథానాయకులనే చూసిన సినీప్రియులకు వరుణ్ రూపంలో ఓ శక్తిమంతమైన ప్రతినాయకుడిని చూపించింది 2019. అందుకే ఈ సంవత్సరానికి బెస్ట్ హీరో కమ్ విలన్ వరుణ్ తేజ్.
ఈ ఏడాది ఉత్తమ విమర్శనాత్మక సూపర్‌హీరో..
కార్తిని.. ఈ ఏడాదికి ఉత్తమ విమర్శనాత్మక సూపర్ హీరోగా ఏకగ్రీవంగా ఆమోదించొచ్చు. 'ఖైదీ', 'దొంగ' లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో 2019లో ఓ కొత్తదనాన్ని పంచిన ఘనత కార్తికే దక్కుతుంది. ముఖ్యంగా ఒక్క పాట, కనీసం కథానాయిక లేకుండా కేవలం ఓ రాత్రిపూట నడిచే కథతో 'ఖైదీ'గా అతడు చేసిన సాహసం సినీప్రియుల మనసులు దోచింది. ఓ వైపు బాక్సాఫీస్ ముందు విజయ్ 'బిగిల్' వంటి బడా చిత్రం రేసులో ఉన్నా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందంటే కార్తి చేసిన ఈ ప్రయోగం థియేటర్లో ఎలా పేలిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆఖర్లో తన వదిన జ్యోతికతో కలిసి 'దొంగ'గా వచ్చి సినీప్రియులకు మరో సరికొత్త అనుభూతిని పంచి ఇచ్చాడు ఈ తమిళ హీరో.
ఈ ఇద్దరికీ కొంచెం చేదు.. కొంచెం తీపి!!
తెలుగులో వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే నాని.. శ్రీ విష్ణులకు 2019 మిశ్రమ ఫలితాన్ని అందించింది. నేచురల్ స్టార్ 'జెర్సీ'తో.. విష్ణు 'బ్రోచేవారెవరురా' చిత్రాలతో విమర్శకులను సైతం మెప్పించేలా చక్కని విజయాలు అందుకోగా.. ఆఖరికి వచ్చే సరికి అదే స్థాయిలో దారుణ ఫలితాల్ని అందుకొన్నారు. నానికి 'గ్యాంగ్‌లీడర్'తో.. శ్రీవిష్ణుకి 'తిప్పరా మీసం'తో పెద్ద షాక్‌లే తగిలాయి.
ఇదీ చదవండి: 'ఆమీర్‌కు తప్ప ఇంకెవరి కోసమూ ఇలా చేయను'