'హిరణ్య కశ్యప'.. తెలుగు చిత్రసీమలో కొన్నేళ్లుగా వినిపిస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. ఇందులో రానా హీరోగా నటించనున్నాడని వార్తలొచ్చాయి. కానీ తర్వాత మళ్లీ ఆ ఊసే వినిపించలేదు. కొంత కాలం తర్వాత 'హిరణ్య కశ్యప' ప్రారంభించనున్నట్లు, ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నట్లు స్వయంగా దర్శకుడు గుణశేఖర్ చెప్పాడు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి రానా తప్పుకున్నట్లు వదంతులు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?
ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన రానా.. ప్రస్తుతం 'హాథీ మేరీ సాథీ' చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది చేస్తూనే 'విరాట పర్వం'లోనూ నటిస్తున్నాడు. నిజానికి ఇవి పూర్తయిన వెంటనే 'హిరణ్య కశ్యప'ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నాడట రానా. కానీ, ఇప్పుడు ఈ చిత్రాన్ని వేరొక హీరోతో తెరకెక్కించమని గుణశేఖర్‌కు సలహా ఇచ్చాడట ఈ నటుడు.
'హిరణ్య కశ్యప'ను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించాలనుకున్నాడు రానా. కానీ, ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మరో హీరోతో తెరకెక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ రానా తప్పుకున్నది నిజమే అయితే.. నిర్మాణ బాధ్యతలను కూడా వదులుకుంటాడా? లేదా? అన్నదీ తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : 'హౌజ్ ద జోష్' అయింది ఇప్పుడు డిష్..!