చిత్రం: 1945; నటీనటులు: రానా దగ్గుబాటి, రెజీనా, సత్యరాజ్, నాజర్ తదితరులు; సంగీతం: యువన్ శంకర్ రాజా; ఛాయాగ్రహణం: సత్య పొన్మార్; ఎడిటింగ్: గోపీకృష్ణ, మాటలు: ఆకుల శివ; పాటలు: అనంత శ్రీరామ్; నిర్మాత: సి.కల్యాణ్; దర్శకుడు: సత్య శివ; విడుదల: 07-01-2022
'బాహుబలి' తర్వాత రానా(Rana) దగ్గుబాటి భిన్న రకాల కథల్ని ఎంపిక చేసుకున్నారు. బహుభాషల్లో విడుదల చేయడమే లక్ష్యంగా ఎంచుకున్న కథలే అన్నీ. వాటిలో ఒకటి.. 1945. పీరియాడిక్ కథతో రూపొందిన ఈ సినిమా చాలా రోజులపాటు సెట్స్‌పైనే మగ్గింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి ప్రచార హంగామా లేకుండా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. (1945 movie review) మరి 1945 కథేంటి? రానా పాత్ర ఎలా ఉంది?
కథేంటంటే: బ్రిటిష్ పాలనపై పోరాటమే లక్ష్యంగా నేతాజీ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్న సమయమది. తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ఆది (రానా దగ్గుబాటి) బర్మా చేరుకుంటాడు. అదే సమయంలో బ్రిటిష్ తహసీల్దార్ (నాజర్) కుమార్తె (రెజీనా)తో నిశ్చితార్థం కూడా కుదురుతుంది. పెళ్లికి సిద్ధమవుతున్న దశలో బ్రిటిషర్ల దురాగతాలు పెచ్చుమీరుతాయి. మరి వాళ్లపై ఆది పోరాటం ఎలా సాగిందన్నదే సినిమా(1945 movie review)
ఎలా ఉందంటే: దేశభక్తి ప్రధానమైన కథ ఇది. ఇలాంటి కథలకి భావోద్వేగాలు, నాటకీయత ఆయువు పట్టుగా నిలుస్తాయి. కానీ, ఈ సినిమాలో అవే లోపించాయి. పోరాట ఘట్టాలు, అప్పటి నేపథ్యం, లొకేషన్లు ఆకట్టుకున్నా మిగతా విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందేమీ లేదు. చాలా సన్నివేశాలు హఠాత్తుగా ముగిసిపోతున్నట్టు అనిపిస్తాయి. కథకి ముగింపు కూడా అసంపూర్ణమే. సినీ రూపకర్తలకీ, కథానాయకుడికీ మధ్య సమస్యలు ఉండటం వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. రానా దగ్గుబాటి డబ్బింగ్ కూడా చెప్పలేదు. అది ప్రేక్షకుడిని ఆదిలోనే ఇబ్బంది పెట్టే అంశం. ఇక కథ పరంగా చూస్తే.. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుంది కానీ, దర్శకత్వంలోనే లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కథనం ఏ దశలోనూ సినిమాని రక్తి కట్టించలేదు. శక్తిమంతమైన బ్రిటిష్ సైన్యంపై పోరాటం అంటే.. దేశభక్తి నేపథ్యంలో భావోద్వేగాలు బలంగా పండాలి. కానీ, ఈ సినిమా విషయంలో ఆ సన్నివేశాలన్నీ కూడా బలవంతంగా అనిపిస్తాయి. రానా దగ్గుబాటి కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించారు కానీ, చాలా చోట్ల పెద్దగా ఆసక్తి లేకుండా నటించిన భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: సైనికుడి తరహా పాత్రలో కనిపిస్తారు రానా. ఆయన లుక్‌తోపాటు కొన్ని పోరాట ఘట్టాల్లో చక్కటి అభినయం ప్రదర్శించాడు. రెజీనా సంప్రదాయబద్ధమైన పాత్రలో నటించారు. సప్తగిరి కొన్నిచోట్ల నవ్వించారు. సత్యరాజ్, నాజర్, కాళీ వెంకట్ తదితరులకి పెద్దగా నటించే అవకాశం రాలేదు కానీ, ఆయా పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సాంకేతికంగా చూస్తే కొన్ని విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. ముఖ్యంగా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సత్య పొన్మార్ కెమెరా 1945 కాలాన్ని, అప్పటి పరిస్థితుల్ని, లొకేషన్లని చాలా సహజంగా చూపించింది. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఆకుల శివ మాటలు కూడా మెప్పిస్తాయి. నిర్మాణం నాసిరకంగా ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, నేపథ్యం ఆకట్టుకున్నా... దాన్ని తెరపైకి తీసుకు రావడంలో పరిణతిని ప్రదర్శించలేదు. అరకొర అంశాలు, సన్నివేశాలతో ఓ అసంపూర్ణమైన సినిమాని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.
బలాలు
+ 1945 నేపథ్యం
+ ఛాయాగ్రహణం
బలహీనతలు
- అసంపూర్ణమైన కథ, కథనం
- నిర్మాణంలో లోపాలు
చివరిగా: భావోద్వేగాలు లేని దేశభక్తి ప్రధాన చిత్రం.. '1945'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: 'అతిథి దేవోభవ' ప్రేక్షకుల మెప్పు పొందిందా?