తొలి తెలుగు సినిమా అనుభవం చాలా బాగుందంటోంది తాన్యా రవి చంద్రన్. సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలైన ఈమె తమిళంలో వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో తొలిసారి 'రాజా విక్రమార్క'తో అవకాశం అందుకుంది. కార్తికేయ కథా నాయకుడిగా... ఆదిరెడ్డి, 88 రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తాన్యా విలేకర్లతో ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"సినిమా కుటుంబం నుంచి వచ్చినదాన్ని కాబట్టి నాకు చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. మా తాతయ్య సినిమాల్లోకి తీసుకు రావాలని ప్రయత్నించారు. మా అమ్మానాన్నలు అప్పట్లో వద్దన్నారు. చదువుపై దృష్టిపెట్టమని కోరారు. పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్ సర్ నుంచి అవకాశం వచ్చింది. మంచి అవకాశమని మా అమ్మానాన్నలతో గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించా. కానీ వరుసగా అవకాశాలు వచ్చాయి. మూడు సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేశా. ఇప్పుడు సినిమాలపై దృష్టిపెట్టా. మా తాతయ్య ఉండుంటే ఎంత సంతోషించేవారో. దురదృష్టవశాత్తూ నేను కెమెరా ముందుకు రాకముందే మాకు దూరమయ్యారు. ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి"
"తెలుగు సినిమాలు చూస్తూనే ఉంటా. ఇక్కడ అవకాశం అనగానే మొదట కొంచెం భయపడ్డా. భాష తెలియకపోవడమే అందుకు కారణం. చిత్రీకరణకు కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌కు వచ్చా. దర్శకుడు శ్రీ సరిపల్లి ఇంగ్లిష్, తెలుగులో స్క్రిప్ట్ సిద్ధం చేసి ఇచ్చారు. నాకు సంబంధించిన సంభాషణలే కాకుండా, మిగతా నటులు సంభాషణలూ రాసి ఇచ్చారు. అవన్నీ చదువుకుని ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చా. కథ, పాత్రలు నచ్చే ఈ సినిమా చేశా. నేను కాంతి అనే కాలేజీ అమ్మాయిగా, భరతనాట్యం డ్యాన్సర్‌గా కనిపిస్తా. చాలా బలమైన పాత్ర. సినిమా అంతా కనిపిస్తా. కాంతి తప్పకుండా మనసుల్ని దోచేస్తుంది. కార్తికేయ చాలా సహజంగా నటిస్తాడు. సాయికుమార్, తనికెళ్ల భరణి తదితర పెద్ద నటులతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా".
"తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదు. రెండు పరిశ్రమలూ నాకు బాగా నచ్చాయి. కమర్షియల్ హీరోయిన్ అనే మాటకు నాకు అర్థం తెలియదు. మంచి కథ, పాత్రలు అనుకుంటే తప్పకుండా నటిస్తా. ఈ పాత్ర అయినా నేను దానికి ఎంత వరకూ న్యాయం చేశాననేది ముఖ్యం. ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాలు చేస్తున్నా".
ఇదీ చూడండి: మైండ్ బ్లోయింగ్ పిల్లా.. అందంతో కట్టిపడేశావే!