విజయవంతమైన సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించడం కొత్తేమీ కాదు. ఎప్పట్నుంచో ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగులో విజయవంతమైన కొనసాగింపు చిత్రాలు తక్కువే. తొలి భాగానికి దీటుగా తెరకెక్కించలేకపోవడం.. ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా పెరిగిపోవడం తదితర కారణాలతో చాలా సినిమాలు పరాజయాల్నే చవిచూశాయి. 'రక్తచరిత్ర', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' తదితర చిత్రాల తర్వాత కొనసాగింపు చిత్రాలపై చిత్రసీమకు బాగా గురి ఏర్పడింది. కథ కాస్త పెద్దదిగా అనిపించిందంటే, రెండు భాగాలుగా చెప్పేద్దాం అన్న ధోరణిలో ఆలోచిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈమధ్య ఓ ఇద్దరు దర్శకులు మూడు భాగాలుగా తీయాలని కథల్ని సిద్ధం చేసుకున్నారంటే సీక్వెల్ సినిమాపై ఏర్పడిన గురి ఏపాటిదో స్పష్టమవుతోంది. మూడు భాగాల చిత్రాల సంగతేమో కానీ.. ఈ ఏడాదిలో రెండో భాగంగా వస్తున్నవి ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.
కాదు కానీ...
ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచి మళ్లీ కథ మొదలైందంటే... వాటినే కొనసాగింపు చిత్రాలు అంటారు. ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. కథలతో సంబంధం లేకుండా పాత్రల్ని కొనసాగించినా వాటిని కొనసాగింపు చిత్రాల్లానే చూస్తోంది చిత్రసీమ. ప్రేక్షకులు కూడా తొలి భాగం సినిమాని దృష్టిలో పెట్టుకునే థియేటర్లకొస్తుంటారు. విజయవంతమైన 'ఎఫ్2' తర్వాత వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా 'ఎఫ్3' తెరకెక్కుతోంది. అయితే ఈ రెండు చిత్రాల్లోని కథలు వేర్వేరు. తొలి సినిమాలో కనిపించిన ఫన్, ఫ్రస్ట్రేషన్.. నాయకానాయికల పాత్రలే రెండో సినిమాలో ఉంటాయని, ఇందులో కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. 'బంగార్రాజు' కొనసాగింపు చిత్రమేమీ కాదు. 'సోగ్గాడే చిన్నినాయనా'కి ముందు భాగంగా రూపొందుతోంది. కానీ సీక్వెల్ సినిమా తరహాలోనే ప్రేక్షకులు, మార్కెట్ వర్గాలు ఈ సినిమాని చూస్తున్నాయి. కథేమిటనేది పక్కనపెడితే తొలి సినిమాని మనసులో పెట్టుకునే వీటికి వస్తారనడంలో సందేహం లేదు.
'పుష్ప' రెండో భాగం
2022లో రెండో భాగాన్ని తీసుకు రావాలనే ప్రణాళికతోనే... 2021లో 'పుష్ప: ది రైజ్' సినిమాని తీసుకొచ్చారు. ఇప్పుడు రెండో భాగం సినిమా కోసం రంగం సిద్ధమైంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ చిత్రం 'పుష్ప: ది రూల్' పేరుతో ఈ ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కానున్నట్టు సమాచారం. బాలకృష్ణ 'అఖండ'నూ కొనసాగించే ఆలోచన ఉందని ఇప్పటికే నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి చెప్పారు. మరోవైపు మంచు విష్ణు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఢీ'కి కొనసాగింపుగా 'డి అండ్ డి' రూపొందనున్నారు. హిందీ నుంచీ సీక్వెల్ సినిమాలు వరుస కట్టనున్నాయి. 'భూల్ భూలయా2', 'హీరో పంటి2', 'బదాయి దో', 'ఏక్ విలన్ 2'... ఇలా చాలానే ఉన్నాయి.
'కేజీఎఫ్2' ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ కథానాయకుడు యశ్ నటించిన 'కేజీఎఫ్' పాన్ ఇండియా చిత్రంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. దానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2' రూపొందింది. ఈ ఏడాది వేసవిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
రెండో కేస్‌తో...
విష్వక్‌సేన్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన 'హిట్' జయవంతమైంది. అది ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతోంది. మరోవైపు ఈ కథకి కొనసాగింపుగా రెండో కేస్‌తో 'హిట్ 2' రూపొందుతోంది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. అలాగే అడవి శేష్ స్పై థ్రిల్లర్ చిత్రం 'గూఢచారి'కి కొనసాగింపుగా 'గూఢచారి2' రూపొందుతోంది. ఇందులోనూ అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తికేయ'కి కొనసాగింపుగా, అదే బృందం 'కార్తికేయ 2' కోసం రంగంలోకి దిగింది. చిత్రీకరణ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ చిత్రాలన్నీ ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందుకే ఈ సంవత్సరం 202-2.
ఇవీ చదవండి:
- టాలీవుడ్ నయా రూటు.. హిట్టు బొమ్మకు సీక్వెల్స్!
- 'ఆదిత్య 369' సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ
- అందుకే 'హిట్' సీక్వెల్ ఒప్పుకోలేదు: విశ్వక్ సేన్
- రవితేజతో అనిల్ రావిపూడి మూడు సినిమాలు!
- పవర్‌స్టార్ హీరోగా 'రిపబ్లిక్' సీక్వెల్!
- 'రాధేశ్యామ్'కు సీక్వెల్.. క్లారిటీ అప్పుడే..!?
- రానాతో 'లీడర్' సీక్వెల్.. శేఖర్‌కమ్ముల క్లారిటీ
- త్వరలో 'ప్రేమదేశం' సీక్వెల్.. అభిమానుల్లో జోష్!
- 'జాతిరత్నాలు' సీక్వెల్ రూపొందిస్తాం: అనుదీప్