తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా కరోనా ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున, లేదంటే వచ్చే నెల ప్రారంభంలో థియేటర్లు తెరుచుకోనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. సినిమాహాళ్లు తెరిచిన వెంటనే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'లవ్‌స్టోరి'(Love Story) విడుదల కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రనిర్మాత సునీల్ నారంగ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.
"థియేటర్లు తెరిచిన తర్వాత రోజుకు మూడు షోలు అనుమతించే క్రమంలో 'లవ్‌స్టోరి' సినిమాను విడుదల చేయలేం. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ సడలించిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాం. నాకు తెలిసి జులై రెండో వారానికి సాధారణ పరిస్థితులు ఉండొచ్చని భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం"
- సునీల్ నారంగ్, నిర్మాత
శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించారు. సునీల్ నారంగ్ నిర్మాతగా వ్యవహరించగా.. పవన్ సీహెచ్ స్వరాలను సమకూర్చారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం కారణంగా అదికాస్త వాయిదా పడింది.
ఇదీ చూడండి.. సరికొత్త రికార్డును సెట్ చేసిన 'సారంగదరియా'!