దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి.. అక్కడి నుంచి హాలీవుడ్‌కి.. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra). ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక సక్సెస్ గురించే అందరూ చెప్పుకొంటున్నారు. కానీ ఆమె కూడా కెరీర్‌లో ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన కెరీర్ గురించి మాట్లాడింది.
"అందరూ నా విజయాల గురించే చెప్పుకొంటున్నారు. కానీ నేను కూడా ఎన్నో అపజయాలు పొందాను. ఒకానొక సమయంలో నేను నటించిన సినిమాలను ఒక్కరు కూడా చూడలేదు. పరాజయాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. నా దృష్టిలో జీవితం ఓ నిచ్చెన లాంటిది. ప్రతి మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతుండాలి. అలాగే కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, పవర్‌ఫుల్ రోల్స్‌లో నటించాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. సుమారు పదేళ్ల కృషి తర్వాత ఇప్పుడు ఆ తరహా రోల్స్‌లో నటిస్తున్నాను" అని ప్రియాంక వివరించింది.