'కేజీఎఫ్' చిత్రంతో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరో యశ్‌కు ఎలివేషన్స్ ఇవ్వడం సహా భారీ ప్రొడక్షన్ వాల్యూతో రూపొందించిన సినిమా ఇది. ఇప్పుడు దానికి రెండింతలు ఎక్కువ యాక్షన్, ఎలివేషన్స్‌తో 'సలార్' చిత్రాన్ని తీస్తున్నారట.
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా సలార్. ఇప్పుడు దీనిని భారతీయ చిత్రసీమలో కనివిని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. నిర్మాతలు కూడా ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రేక్షకులు, అభిమానులకు 'కేజీఎఫ్'ను మించిన డబుల్ ట్రీట్ ఇవ్వనున్నామని చిత్రబృందం ధీమాగా ఉంది. ఇటీవలే మొదలైన సినిమా రెండో షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తోంది. వచ్చే నెలలో మూడో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
'సలార్' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతోనే కన్నడలోకి ప్రభాస్ అరంగేట్రం చేయనున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి.. అందం కోసం దాని మాటే వింటా: అదితీరావ్