"గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్ అలాంటి వాడే. నేను హీరోగా దక్షిణాది చిత్రసీమల్లో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నా. కానీ ప్రభాస్ ఏకంగా ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు" అని అన్నారు సీనియర్ నటుడు కృష్ణంరాజు.
దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ఈయన. ఈనెల 20న ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ముందస్తుగా కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
"మేం(గోపీకృష్ణ మూవీస్).. ప్రభాస్ కొత్త సినిమాను అంచనాలకు తగ్గట్లుగానే తీస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. హైదరాబాద్‌లో నిన్న(శుక్రవారం) కొత్త షెడ్యూల్ మొదలైంది. మరో మూడు నెలల ఇక్కడే షూటింగ్. ఏప్రిల్, మే నెలలో విదేశాలకు వెళ్తాం. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. నేనూ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నా" -కృష్ణంరాజు, నిర్మాత, సీనియర్ నటుడు
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాత కాలం నాటి కథతో తీస్తున్నారు. పూర్తిస్థాయి ప్రేమకథతో రూపొందిస్తున్నారు.