'బాహుబలి' తర్వాత గడ్డం చూస్తే చిరాకొచ్చేసింది అని అంటున్నాడు టాలీవుడ్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. తాజాగా ఈ హీరో 'మత్తువదలరా' చిత్రబృందంతో సరదాగా ముచ్చటించాడు. కీరవాణి రెండో కుమారుడు సింహా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన ఈ చిత్రానికి కాలభైరవ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ) ఈ చిత్రాన్ని నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రబృందాన్ని ప్రశంసించాడు. దీనికి సంబంధించిన విశేషాలివి.
ప్రభాస్: 'మత్తు వదలరా' సినిమాకు కథే హీరో? కనుక డైరెక్టర్ రితేశ్‌తోపాటు కో రైటర్ అయిన మీరు ఈ సినిమాకు హీరోలనుకోవచ్చా?
తేజ: స్టోరీనే హీరో అయితే నేను, నా దర్శకుడే రితేశ్ రానానే ఈ సినిమాకు హీరోలం.
ప్రభాస్: నిర్మాతలు మీకు ఏవిధంగా సాయం చేశారు? ఏ విషయంలోనైనా కోప్పాడ్డారా?
తేజ: మా నిర్మాత చెర్రీ ఏం అడిగినా చేసేవారు. ఆయన ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోలేదు.
ప్రభాస్: మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాను. ఈ సినిమాలో మీరు ఏ వర్క్స్ చూశారు?
తేజ: అవును సర్. చిత్ర పరిశ్రమకు చెందిన అన్నీ రంగాలలో నాకు చాలా ఇష్టం ఉంది. అలా నేను ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్, సెట్ డిజైనింగ్‌తోపాటు కథ రాశాను.
ప్రభాస్: సింహా ఎలా ఉంది?
తేజ: సింహా నటనను ఊహించలేదు. అతను బాగా నటించాడు. ఈ సినిమాలో 30 నిమిషాలపాటు సింహా ఏం మాట్లాడకుండా ఉంటాడు. కానీ ఆ సమయంలో సింహా ఇచ్చే రియాక్షన్స్ నాకెంతో నచ్చాయి.
ప్రభాస్: కొత్త నటీనటులు, డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడం పట్ల మీకున్న నమ్మకం ఏమిటి?
చెర్రీ: సినీ పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి కొంచెం విభిన్నంగా, వినూత్నంగా సినిమాలు తెరకెక్కించాలని ఉండేది. 'మని', 'గులాబి', 'ఛత్రపతి' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. ఒకరోజు రితేశ్ నా ఆఫీస్‌కు వచ్చి కథ చెప్పారు. ఆ కథ నాకెంతో నచ్చింది. థ్రిల్లర్ చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. 'మత్తువదలరా' ఒక థ్రిల్లర్ చిత్రం. అందులోను బాగా నవ్వించే థ్రిల్లర్ జోనర్ పిక్చర్. రితేశ్ రానా కథ చెప్పడం మాత్రమే కాకుండా కథతోపాటు ఇతర నటీనటుల పాత్రల గురించి, టెక్నికల్ వర్క్ గురించి కూడా చెప్పారు. ఆయన చేసిన షార్ట్ ఫిలింస్ కూడా చూశాను. నాకు అప్పుడే నమ్మకం కలిగింది.
ప్రభాస్: సింహా, కాలభైరవను ఈ సినిమాలోకి తీసుకున్నప్పుడు కీరవాణి ఏం అన్నారు?
చెర్రీ: సింహా, కాలభైరవను 'మత్తువదలరా' చిత్రంతో పరిచయం చేసినప్పుడు రాజమౌళి, కీరవాణి కుటుంబాలకు నా మీద నమ్మకం ఉంది కానీ నాకు మాత్రం ఎంతో భయం ఉండేది. ఒకవేళ ఈ సినిమా ఆడకపోతే నేను వాళ్లకి సమాధానం చెప్పాల్సి వస్తుందనుకున్నాను. కీరవాణికి ఈ సినిమా గురించి చెప్పగానే నీకు సింహా, భైరవ బాగా చేస్తారనే నమ్మకం ఉంటే తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత సింహా, కాలభైరవకు కథ చెప్పాను. వాళ్లకి కూడా కథ నచ్చింది. ఓకే చేస్తాం అన్నారు. వల్లిగారు కనిపించరు కానీ చాలా టెన్షన్ పడుతుంటారు. ఈ సినిమా ఫైనల్ కాఫీ చూశాక ఆమె ముఖంలో కొంచెం రిలీఫ్ చూశాను.
ప్రభాస్: సింహా నటన ఎలా ఉంది?
చెర్రీ: సింహా నటన చాలా బాగుంది. ఈ సినిమాలోని రౌండ్ ట్రాలీ షాట్ చాలా మందికి నచ్చింది. ఆ షాట్ షూట్ చేస్తున్న సమయంలో మూడు టేక్స్ వరకూ నేను అక్కడే ఉన్నాను. ఆ మూడు టేక్స్‌లో ఒకే రకమైన హావభావాలు పలికించాడు. నిజం చెప్పాలంటే ఆ షాట్‌ను 22 టేక్స్ వరకూ తీశారు. అది అన్నీ సార్లు ఫెయిల్ అవ్వడానికి కారణం సాంకేతిక లోపాలే. సింహా మంచి నటుడు అవుతారు. భైరవ నా నమ్మకాన్ని నిజం చేశాడు. భైరవకు మంచి భవిష్యత్తు ఉంది.
ప్రభాస్: కాలభైరవ 'మత్తువదలరా' సంగీతం చాలా బాగుంది. ఈ కథకు పనిచేయడం ఎలా ఉంది?
కాలభైరవ: నా మొదటి సినిమానే ఓ థ్రిల్లర్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంటర్‌వెల్ సన్నివేశం అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే అక్కడి నుంచే మొదట ఆర్ఆర్ షార్ట్ చేశాను. ఆర్‌ఆర్ ఇవ్వడానికి ముందు మూడుసార్లు ఈ సినిమా చూశాను. అలా నాకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యాక ఈ సినిమాకు ఆర్‌ఆర్ ఇవ్వడం ప్రారంభించాను.
ప్రభాస్: తమ్ముడు సినిమాకు మ్యూజిక్ అందించడం ఎలా ఉంది?
కాలభైరవ: సింహా సినిమాకు మ్యూజిక్ అందించడం నాకు ఎమోషనల్‌గా అనిపించింది. కానీ దానికంటే సినిమాకు మంచి మ్యూజిక్ అందించాలనే ఆసక్తి మరింత ఎక్కువైంది. ప్రతిరోజూ నేను చేసిన పనిని ఇంటికి వెళ్లి మళ్లీ చెక్ చేసుకునేవాడిని. అలా సింహా సన్నివేశాలకు నేను అందించిన మ్యూజిక్‌కు సంబంధించిన వీడియోలను ఇంటికి వెళ్లి చూసుకుని మురిసిపోయేవాడిని.
ప్రభాస్: కీరవాణి గారు ఈ వర్క్ గురించి ఏమన్నారు?
కాలభైరవ: కీరవాణి కుమారుడిని అనే ఒత్తిడి నాపై ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా చేస్తున్నంతసేపూ 'మత్తువదలరా' టీం మొత్తం నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. నాన్నకు మొదట నేను మ్యూజిక్ అందించిన రెండు సన్నివేశాలు చూపించాను. ఆయన మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇంకా బాగుంటే బాగుండేది అని కూడా చెప్పారు.
ప్రభాస్: నిర్మాత చెర్రీ గురించి చెప్పండి?
కాలభైరవ: చెర్రీ మామే నన్ను ఈ సినిమాలో భాగం చేశారు. నేను బాగా చేయగలనని చెప్పి నమ్మకంతో ఈ టీంలోకి నన్ను తీసుకున్నారు. థ్యాంక్యూ చెర్రీ మామ.
ప్రభాస్: ఎప్పుడైనా చెర్రీ తిట్టారా?
కాలభైరవ: అలాంటివి ఏం లేవు. ఆయన చాలా సున్నితంగా మాట్లాడతారు.
ప్రభాస్: ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నువ్వు కొంచెం లో వాయిస్‌తో మాట్లాడావ్. అది ఎలా మేనేజ్ చేశావ్?
సింహా: అలా లో వాయిస్‌తో మాట్లాడమని రితేశ్‌రానా చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకు నిద్రమత్తు. అది చూపించడం కోసం సినిమా ఆరంభ సన్నివేశాల్లో 10 నిమిషాలపాటు లో వాయిస్‌లో మాట్లాడించారు.
ప్రభాస్: నీకు కష్టమైన పార్ట్?
సింహా: మొదటి పది నిమిషాలు లో వాయిస్ ఇవ్వడం నాకు కష్టంగా అనిపించింది. మిగిలిన కొన్ని సన్నివేశాలు కష్టంగా అనిపించాయి కానీ రిహార్సల్స్ చేయడం వల్ల అంత కష్టంగా అనిపించలేదు.
ప్రభాస్: రౌండ్ ట్రాలీ షాట్ చేయడం ఎలా అనిపించింది?
సింహా: రౌండ్ ట్రాలీ షాట్‌కు ముందే నేను, సత్య, అగస్త్య.. మా పాత్రలకు సంబంధించిన పూర్తి డైలాగులు, ఎమోషన్స్‌ను నేర్చుకున్నాం. కానీ కెమెరా ముందుకు వచ్చేసరికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల దానిని 22 టేక్స్‌లో షూట్ చేశాం.
ప్రభాస్: 30 నిమిషాలు ఎలాంటి డైలాగ్స్ లేకుండా చేయడం ఎలా అనిపించింది?
సింహా: చాలా బాగా అనిపించింది. చాలా ఆసక్తికరంగా ఫీల్ అయ్యాను. కథ విన్నప్పుడు మొదట నాకేం అర్థం కాలేదు. కానీ 30 నిమిషాల సన్నివేశాలు నాకెంతో బాగా నచ్చాయి.
ప్రభాస్: నెక్ట్స్ ఏ జోనర్ సినిమా చేయాలనుకుంటున్నావ్?
సింహా: ఇంకా ఏం అనుకోలేదు. నాకు రొమాన్స్ తప్పా ఏ జోనర్ అయినా ఒకే. లవ్ స్టోరీస్ నాకు అంత సెట్‌కావు. (మధ్యలో ప్రభాస్ అందుకుని మొదట్లో రాజమౌళి కూడా అలాగే అన్నారు కానీ ‘మగధీర’ చేయలేదా .. (నవ్వులు))
ప్రభాస్: ఈ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యావ్..?
సింహా: ఈ పాత్ర కోసం నేను 8 నెలల పాటు గడ్డం, జట్టు పెంచాను. మా ఇంట్లో వాళ్లు అఘోరాలా ఉన్నావ్ అనేవాళ్లు. (మధ్యలో ప్రభాస్ అందుకుని 'బాహుబలి' తర్వాత నాకు గడ్డం మీద విరక్తి వచ్చేసింది. రానా ఎప్పుడైనా గడ్డంతో కనిపిస్తే వెంటనే షేవ్ చేసుకో అని చెప్పేవాడిని)
ప్రభాస్: ఈ సినిమాకు ముందుకు మీకు దర్శకత్వంపై ఏమైనా అనుభవం ఉందా?
రితేశ్ రానా: ఈ సినిమాకు ముందు నేను 10 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. మూడేళ్లు క్రితం చెర్రీకి ఈ స్టోరీ చెప్పాను. అలా మాకు ప్రీ ప్రొడక్షన్‌కు చాలా టైం వచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా తెరకెక్కించాం.
ప్రభాస్: ఎడిటింగ్‌లో ఎక్కువ సన్నివేశాలను తొలగించారా?
రితేశ్ రానా: లేదు సార్. చివరి ఫైట్ ఒక్కటే 15 నిమిషాలు చేశాం. కానీ దాన్ని మూడు నిమిషాలకు తీసుకువచ్చాం. దానికి మిచ్చి ఏది చేయలేదు.
ప్రభాస్: సింహా నటన ఎలా ఉంది?
రితేశ్ రానా: సింహా నటన చాలా బాగుంది. కథకు తగ్గట్టు ఆయన ఇచ్చిన రియాక్షన్ బాగా నచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">