Puneeth Rajkumar Modi: తన నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్. అంతా ఆయనను ముద్దుగా అప్పూ అని పిలుచుకుంటారు. వారందరికీ తీరని శోకాన్ని మిగిల్చి.. కానరాని లోకాలకు వెళ్లిపోయారు పునీత్. సినీ, రాజకీయ ప్రముఖులు సహా యావత్ ప్రజానీకం ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ సమయంలో సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Puneeth Rajkumar Meets Modi: రాజకీయాలంటే అంతగా ఇష్టం లేని పునీత్ రాజ్‌కుమార్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు ఆయన సన్నిహితుడు ఎన్ఎస్ రాజ్‌కుమార్. రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓసారి అప్పూను అడిగారట. ఈ విషయాన్ని పునీత్ స్వయంగా తనకు చెప్పారని ఎన్ఎస్ రాజ్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నట్లు వెల్లడించారు.
''నీలాంటి యువతారలు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని పునీత్‌ను కోరారు మోదీ. ప్రధానితో మాట్లాడిన తర్వాత పునీత్ బయటకు వచ్చి ఈ విషయం నాతో చెప్పారు. రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని అప్పుడు నాతో అన్నారు.''
- ఎన్ఎస్ రాజ్‌కుమార్
కర్ణాటక వచ్చిన సమయంలో.. పునీత్ రాజ్‌కుమార్ దంపతులను ప్రధాని ఆహ్వానించారని చెప్పారు ఎన్ఎస్. మొదట వెళ్లేందుకు అప్పూ తిరస్కరించినా.. తన మాటలకు గౌరవం ఇచ్చి బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద మోదీని కలిశారని వెల్లడించారు.
''మోదీని కలిసిన సమయంలో.. పునీత్ తన తండ్రి డా. రాజ్‌కుమార్ జీవిత కథ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు మోదీ ఫ్లైట్ కాస్త ఆలస్యం అయింది. అయినా పునీత్‌తో 7 నిమిషాలపాటు మాట్లాడారు.''
- ఎన్ఎస్ రాజ్‌కుమార్
అంతకుముందు.. పునీత్‌తో మాట్లాడేందుకు నిర్మాత ఎస్పీ బాబు ద్వారా భాజపా నేతలు ఆశిష్, పీవీఎస్ శర్మ తనను సంప్రదించారని ఎన్ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. అప్పుడే పునీత్‌కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఆశిష్‌కు చెప్పినట్లు వివరించారు.
''ఆశిష్‌తో.. మీ ఆఫర్‌ను పునీత్ ఒప్పుకోరని చెప్పా. కానీ.. పునీత్ దగ్గరకు తీసుకెళ్లాలని నన్ను బలవంతపెట్టారు. ఆశిష్‌ను, శర్మను అప్పూ ఇంటికి తీసుకెళ్లా. కానీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన ఒప్పుకోలేదు. చిన్నగా నవ్వి.. లోపలకు వెళ్లి టీ తీసుకొచ్చారు. బయటకు వచ్చాక రాజకీయాల గురించి మాట్లాడలేదు.''
- ఎన్ఎస్ రాజ్‌కుమార్
అక్టోబర్ 29 ఉదయం 11:30 గంటలకు జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పునీత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పూ మొత్తం 32 కన్నడ సినిమాల్లో నటించారు. ఇందులో ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి.
ఇవీ చూడండి: