సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లోని బంధుప్రీతి, మాఫియా లాంటి అంశాలు మరోసారి తెరపైకొచ్చాయి. వీటిపై కొంతమంది సినీప్రముఖులు వారివారి అభిప్రాయాల్ని వెల్లడించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా దీని గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలోని కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని, సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు ఇలా చేయడం సరికాదని అన్నారు.
"నటుడిగా మీరు చెప్పే ప్రతిమాట ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాళ్లు మీ మాటలను నమ్ముతున్నారు. సెలబ్రిటీలుగా మనం చెప్పిన విషయాన్ని మర్చిపోయినా.. వాళ్లు మాత్రం గుర్తుంచుకుంటారు. ఎందరికో మనం ప్రేరణగా నిలిచాం. ప్రజలంతా మనల్ని అనుసరిస్తున్నారు. అదే మన భుజాలపై ఉన్న పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఉండాలి. హిందీలో ఓ సామెత కూడా ఉంది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడకూడదు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్ మృతిపై స్పందించిన దాని కంటే ఇకపై తెలివిగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నా."
-సోనూసూద్, బాలీవుడ్ నటుడు
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, లాక్డౌన్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంతూళ్లకు చేర్చే పనిలో బిజీగా ఉన్నారు సోనూ. అలా ఎంతోమందిని కష్టాలు తీర్చి, వారి మనసుల్లో చోటు సంపాదించారు.