తమ కుటుంబానికి వారసత్వంగా వస్తోన్న పటౌడీ ప్యాలెస్‌ను రూ.800 కోట్లు చెల్లించి ఓ హోటల్ గ్రూప్ నుంచి బాలీవుడ్ హీరో సైఫ్ తిరిగి కొనుగోలు చేశారంటూ వస్తోన్న వార్తలపై సదరు నటుడు స్పందించారు. అవన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. పటౌడీ ప్యాలెస్‌తో తనకు అమితమైన అనుబంధం ఉందని తెలిపారు.
లీజుకు మాత్రమే ఇచ్చాం!
"పటౌడీ ప్యాలెస్‌తో నాకు ఎన్నో మధురానుభూతులున్నాయి. మా పూర్వీకులు దానిని నిర్మించి.. కొంతకాలంపాటు రాజ్యపాలన చేశారు. అది కేవలం ప్యాలెస్ మాత్రమే కాదు ఓ గౌరవం. అలాంటి ప్యాలెస్‌ను మేము ఓ హోటల్ గ్రూప్‌కు అమ్మేశామని.. ఇటీవల దాదాపు రూ.800 కోట్లు చెల్లించి దానిని తిరిగి కొనుగోలు చేశామని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మా ప్యాలెస్‌ను ఓ హోటల్ గ్రూప్‌కు లీజుకు ఇచ్చాం. అంతేకానీ అమ్మకాలు చేయలేదు. ఆ ప్యాలెస్‌లో మా అమ్మకి ఓ ఠమంచి కాటేజ్ కూడా ఉంది. హోటల్ వాళ్లు మా ప్యాలెస్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు" అని సైఫ్ అలీ ఖాన్ స్పష్టతనిచ్చారు.
'' భవిష్యత్తులో తప్పకుండా నా కుటుంబంతో కలిసి ప్యాలెస్‌లోనే సెటిల్ అవుతా. అక్కడ అందమైన ఉద్యానవనం ఉంది. స్విమ్మింగ్, పుస్తకాలు చదవడం.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని సరదాగా గడుపుతూ.. ప్యాలెస్‌లోనే ఉండాలనుకుంటున్నా. ముంబయిలో మాకు అపార్ట్‌మెంట్ ఉంది. కాబట్టి షూటింగ్స్, ఇతర పనులపై ముంబయికి వచ్చి వెళ్తూ ఉండొచ్చు. కాకపోతే ప్యాలెస్ చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి''.
-సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటుడు
'ఇబ్రహీం కోఠి'
పటౌడీ ప్యాలెస్‌గా పేరు పొందిన ఈ భవంతి హరియాణాలోని పటౌడీ ప్రాంతంలో ఉంది. దీనినే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు. పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు దీనిని నిర్మించి పరిపాలన సాగించారు. ఆ సంస్థానానికి చెందిన ఎనిమిదో నవాబు ఇఫ్తీఖర్ అలీఖాన్ పటౌడీ నుంచి ఆయన కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీకి ఇది వారసత్వంగా వచ్చింది. మన్సూర్ అలీఖాన్ మరణం తర్వాత ఆయన కుమారుడైన సైఫ్ ఆధీనంలో ప్రస్తుతం ఈ ప్యాలెస్ ఉంది.
ఇదీ చదవండి:తెలుగు వంటకాలపై ప్రేమలో పడ్డ 'ఇస్మార్ట్' నటి