తెలుగురాష్ట్రాల్లో సినిమాహాళ్ల తాళాలు తెరించేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. కానీ ఎప్పుడనే విషయంలోనే ఇంకా ప్రదర్శనకారుల మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. తెలంగాణలో ఈ నెల 30 నుంచి సినిమా థియేటర్లు పునఃప్రారంభించాలని పలు యాజమాన్యాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు... విద్యుత్, నిర్వాహణ ఛార్జీల విషయంలో ప్రకటించిన రాయితీ ఉత్తర్వులు వచ్చాక... హాళ్లు తెరవాలని భావిస్తున్నారు. ఈలోగా ఉత్తర్వులు వస్తే 23 నుంచే సినిమా ప్రదర్శనలు కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే జులై 30న పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన తిమ్మరుసు 30న విడుదల చేయాలని నిర్ణయించారు. మరికొన్ని సినిమాలు కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడితే అనువాద చిత్రాలతో థియేటర్లను పునఃప్రారంభించాలని భావిస్తున్నారు.
ఓటీటీ వివాదం..
మరోవైపు ప్రదర్శనకారులు, నిర్మాతల మధ్య ఓటీటీ వివాదం కొనసాగుతూనే ఉంది. థియేటర్ల కంటే ముందే నారప్ప వంటి అగ్రనటుల చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు చిన్ననిర్మాతలు కూడా అటువైపుగా ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రదర్శనకారులు... సాధ్యమైనంత త్వరగానే థియేటర్ల తాళాలు తెరవాలని భావిస్తున్నారు.
వేచిచూసే ధోరణిలో..
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాహాళ్ల పునఃప్రారంభంపై ప్రదర్శనకారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఏపీలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.... 50 శాతం ప్రేక్షకులతో సినిమా హాల్స్ తెరుచుకోవచ్చని అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ టికెట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ధరల పెంపుపై ఉత్తర్వులు సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ పెద్దలు జోక్యం చేసుకొని టికెట్ ధరల విషయంపై ప్రభుత్వంతో చర్చించాలని కోరుతున్నారు. అయితే తెలంగాణలో 30 నుంచే థియేటర్లు తెరిచేందుకు సిద్ధమవుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్ల పునఃప్రారంభం ఎప్పుడనేది ఈ రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు ప్రదర్శనకారులు తెలిపారు.
'సేవ్ సినిమా సేవ్ థియేటర్'..
కొన్నాళ్లుగా థియేటర్లు నష్టాల బాటనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రేక్షకులు సినిమా హాళ్లకు రాకపోవడం వల్ల ఆ నష్టం మరింత ఎక్కువైంది. దాంతో ఎగ్జిబిటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీవో నంబరు 75 (23-6-2017)ను పునః పరిశీలించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నెల8న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు 'సేవ్ సినిమా సేవ్ థియేటర్' నినాదంతో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ లేఖలో పేర్కొంటూ, తగిన షరిష్కారం చూపాలని కోరింది.
ఆ వివరాలివీ..
- G.O. Ms. No.75, dt. 23-06-2017ని పునః పరిశీలించాలి.
- సినిమా హాళ్లకు వచ్చే ప్రధాన ఆదాయ మార్గం పార్కింగ్ ఫీజు. దశాబ్దాలుగా థియేటర్లు పార్కింగ్‌కు కొంత ఫీజు వసూళ్లు చేశాయి. ప్రస్తుతం థియేటర్లలో పార్కింగ్‌ను ఉచితం చేయడం వల్ల నష్టంవాటిల్లుతోంది. పైగా పార్కింగ్ సిబ్బందికి జీతం ఇవ్వాల్సిందే. కొవిడ్ నేపథ్యంలో శానిటైజర్లు తదితర వాటిని సమకూర్చాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని నామమాత్రపు పార్కింగ్ ఫీజుకు అనుమతించాలి.
- గతేడాది లాక్‌డౌన్ నుంచి థియేటర్లన్నీ మూతబడ్డాయి. అయినా కనీస విద్యుత్తు ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మినిమమ్ డిమాండ్ ఛార్జీలను మాఫీచేసి, ఎగ్జిబిటర్ల వ్యాపారాన్ని గాడిన పడేలా చేయాలి.
- గత రెండేళ్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను రద్దు చేస్తే లాక్‌డౌన్ కారణంగా వాటిల్లిన నష్టాల్ని పరోక్షంగా తీర్చినట్టవుతుంది.
- స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఎస్.జి.ఎస్.టి)ను తొలగించాలి
ఇవీ చూడండి: Theaters Reopen: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్