భారతీయ సినిమా వారసత్వ సంపదను పరిరక్షణించుకోవాల్సిన ప్రాముఖ్యతపై ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కీవ్స్(ఎఫ్ఐఎఎఫ్) సంయుక్తంగా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబరు 15 వరకు జరగనుంది. వేడుకకు సినీ ప్రముఖులు రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, టి.సుబ్బరామిరెడ్డి, రమేష్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమఖ దర్శకుడు శ్యామ్ బెనగల్... సినిమా ప్రాముఖ్యతపై మాట్లాడాడు.
"సినిమాలు మన జీవితాల్లో అంతర్భాగం. వాటిని భద్రపరచడం అంటే మన దృశ్యపరమైన చరిత్రను, మన వారసత్వాన్ని, జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడమే. మనకెంతో విలువైన సినిమా వారసత్వ సంపద ఉంది. కానీ దాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలియదు. ఇది బాధాకరమైన విషయం. వాటినెలా భద్రపరచాలన్న అంశంపై ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ శిక్షణ ఇస్తోంది. మన సినీ చరిత్రని పరిరక్షించుకోవడం ద్వారా భావి తరాలకు మన సంస్కృతిని అందించగలుగుతాం. 1950ల నాటి ఓ సినిమాను చూస్తే ఆనాటి సంస్కృతిని తెలుసుకునే వీలుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుండాలి. దీనికి ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కావాలి."
శ్యామ్ బెనగల్, సినీ దర్శకుడు.
ప్రస్తుతం చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయని అభిప్రాయపడిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి... డిజిటల్ మీడియా మూవీలను తీసినా వాటిని కూడా మనం భద్రపరుచుకోలేకపోతున్నామని అన్నాడు.
"ఒకప్పుడు ‘మగధీర’ సినిమాను భద్రపరచమని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు శివేంద్ర నన్ను అడిగారు. నేను చేస్తా అన్నా. అప్పుడు డిజిటల్‌లో 4కె రిజల్యూషన్‌లో ఉన్న ఆ సినిమా కాల క్రమంలో 2కె రిజల్యూషన్‌కి పడిపోయింది. ఆ చిత్ర నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి వీటిని మనం కోల్పోకుండా ఉండాలంటే కచ్చితంగా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది."
రాజమౌళి, సినీ దర్శకుడు
ఈ తరంవారికి రాజ్‌కపూర్, ఎల్వీ ప్రసాద్ వంటి అలనాటి నటులు చాలామందికి తెలియదని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. వాళ్లందించిన విలువైన సినీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాద్యత మనందరిపైనా ఉందన్నాడు చిరు.
"నేను రాజకీయాల్లోకి వెళ్లాక ఓ నిర్మాత నాకు అరుదైన కానుకిచ్చారు. నన్ను స్టార్ హీరోగా నిలబెట్టిన ‘ఖైదీ’ నెగిటివ్ హక్కులను నాకే బహుమతిగా ఇచ్చారు. కానీ నాకు అవి ఏ ల్యాబ్‌లోనూ దొరకలేదు. ఇది నన్ను చాలా బాధించింది. మనం మన చిత్రాలను పరిరక్షించుకోకపోవడమే దీనికి కారణం. ఈతరంలో ఎంత మందికి రాజ్‌కపూర్, చిత్తూరు నాగయ్య, ఎల్వీ ప్రసాద్ లాంటి వాళ్లు తెలుసు. వాళ్లందించిన విలువైన సినీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది."
చిరంజీవీ, సినీ నటుడు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ నాగార్జన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని చిత్రాలను కూడా భద్రపరచుకోలేకపోయామని నాగ్ బాధను వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తను నటించిన 'గీతాంజలి', 'శివ' సినిమాల నెగిటివ్ రీల్స్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి నుంచైనా సినీ వారసత్వ సంపదను కాపాడుకోవాలని... ఇందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని అభిప్రాయపడ్డాడు నాగార్జన.