కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో వారికి అండగా నేనున్నానంటూ.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకొచ్చి వారి పాలిట దైవంగా మారాడు. అలా సాయం పొందిన వారిలో ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుమార్ ప్రధాన్ ఒకరు. సోనూ పుణ్యమా అని కేరళలోని కొచ్చిలో చిక్కుకున్న అతను.. తన స్వగ్రామానికి విమానంలో ప్రయాణించి సురక్షితంగా చేరుకున్నాడు. అందుకు కృతజ్ఞతగా తను కొత్తగా ప్రారంభించిన వెల్డింగ్ దుకాణానికి సోనూసూద్ పేరు పెట్టాడు.
"నేను కొచ్చి విమానాశ్రయ సమీపంలో ఉన్న ఓ కంపెనీలో ప్లంబర్‌గా పని చేస్తున్నా. నేను రోజుకు 700 రుపాయలు సంపాదిస్తా. అయితే, లాక్డౌన్ కారణంగా నేను నా ఉద్యోగాన్ని కోల్పోయా. ఫలితంగా జీవనోపాధి స్తంభించింది. శ్రామిక్ రైలులో సీటును దక్కించుకోవడంలో విఫలమయ్యా. స్థానిక నాయకులు అసలు సాయం చేయలేదు. ఇక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో సోనూ దేవదూతగా వచ్చారు. నా లాంటి ఎంతో మందిని వారి స్వగ్రామాలకు పంపించారు."
-ప్రశాంత్ కుమార్ ప్రధాన్, వలస కార్మికుడు
ఈ విషయంపై సోనూ స్పందిస్తూ.. "నేను చాలా బ్రాండ్లను ఆమోదించా. కానీ ఇది నా మనసుకు చాలా ప్రత్యేకమైనది." అని పేర్కొన్నాడు. ఒడిశాకు వచ్చినపుడు ప్రశాంత్ దుకాణాన్ని సందర్శిస్తానని తెలిపాడు.