"సినిమాలకు కథలు దొరకడం లేదనే వాదన తప్పు. తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని కథలు ఇతర భాషల్లో లేవు. ప్రస్తుతం మన సాహిత్యంలో దాదాపు లక్షా 50వేల పైగా కథలున్నాయి. వాటిలో చాలా వరకు సినిమాలుగా మలుచుకోదగినవే. ఫిల్మ్ మేకర్స్ మంచి కథల్ని తీసుకుని సినిమాలుగా తీస్తే పరిశ్రమలో.. మన ప్రతిభకు కచ్చితంగా చక్కటి గుర్తింపు దక్కుతుంది".
- ఇటీవల 'మెట్రో కథలు' వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ చెప్పిన మాటలివి.
చిత్ర పరిశ్రమకు కావాల్సిన అద్భుతమైన కథా వస్తువులు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. ఓ తరంలో ఆ అపురూప కథా వస్తువుల్ని.. వాటిని అందించిన గొప్ప రచయితల్ని స్వర్ణ సింహాసనంపైనా ఊరేగించింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఇలా తెలుగు సాహిత్యం నుంచి దృశ్య రూపంలోకి మారి బాక్సాఫీస్ ముందు విజయ పతాకం ఎగరేసిన చిత్రాలు అప్పట్లో అనేకమున్నాయి. యండమూరి వీరేంద్రనాథ్ నవాలాధారంగా తెరకెక్కిన చిరంజీవి 'అభిలాష', వంశీ కలం నుంచి జాలువారిన 'సితార', మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలతో తెరపైకొచ్చిన చిరు 'చంటబ్బాయ్', కోడూరి కౌసల్యా దేవి రచనల నుంచి ఊపిరిపోసుకున్న 'ప్రేమ్ నగర్', 'డాక్టర్ చక్రవర్తి', యద్దనపూడి సులోచనారాణి నవలలతో రూపొందిన 'జీవనతరంగాలు', 'సెక్రటరీ', రంగనాయకమ్మ 'బలిపీఠం'.. ఇలా చెప్పుకొంటూ పోతే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన నవలాధారిత చిత్రాలు అనేకం. ఒకప్పుడు తెలుగు చిత్ర సీమకు సాహిత్యానికి ఉన్న అనుబంధం మధ్యలో ఎందుకో తెగిపోయింది. అడపాదడపా త్రివిక్రమ్ లాంటి దర్శకులు 'అఆ' (యద్దనపూడి సులోచనా రాణి రచించిన 'మీనా' నవల స్ఫూర్తితో తెరకెక్కింది) లాంటి నవలాధారిత చిత్రాలతో వెండితెరపై మెప్పించినా సరే మిగతా దర్శకులెవరూ ఆ తరహా ప్రయోగాలు చేయలేదు.
ఇప్పుడు కరోనా - లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఓటీటీ వేదికలకు ఆదరణ పెరగడం వల్ల సాహిత్య రంగంలోనూ కదలిక వచ్చింది. ఫలితంగా ఇన్నాళ్లు నవల రూపంలోనే ఉండిపోయిన అనేక అపురూప కథలకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. సాహిత్యం నుంచి కథల్ని తీసుకునే ప్రయత్నం ఎక్కువగా హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రసీమల్లోనే కనిపిస్తుంటుంది.
మూడేళ్లుగా తమిళం, మలయాళ భాషల్లో నవలాధారిత వెబ్‌ఫిల్మ్స్ జోరు పెరిగింది. తమిళంలో విజయం సాధించిన 'అసురన్'(తెలుగులో 'నారప్ప') ఓ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే. ఇప్పుడు కరోనా పరిస్థితుల తర్వాత తెలుగు చిత్రసీమలోనూ ఆ మార్పు మొదలైంది.
- ఈ మధ్యే ప్రముఖ రచయిత కదీర్‌బాబు 'మెట్రో కథల్ని' ఆహా ఓటీటీ వెబ్‌సిరీస్‌గా తీసుకొచ్చారు.
- ఇదే పంథాలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మధుబాబు రాసిన 'షాడో' నవల దృశ్య రూపంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇందులో షాడోగా ఓ పేరున్న కథానాయకుడే కనిపించనున్నారు.
- చలం రాసిన 'మైదానం' త్వరలోనే దృశ్య కావ్యంగా రానుంది. యువ దర్శకుడు వేణు ఊడుగుల దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ఆ మధ్యే ప్రకటించారు. వీళ్లే కాదు.. అగ్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ నవాలాధారిత చిత్రం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసమే బండి నారాయణ స్వామి రాసిన 'శప్తభూమి' నవలా హక్కులను తీసుకున్నారు. అయితే దీన్ని సినిమాగా వెండితెరపైకి తీసుకొస్తారా, లేక వెబ్‌సిరీస్‌గా మలచనున్నారా? అన్నది స్పష్టత లేదు.
- సిరీస్‌లే కాదు.. సినిమాలూ వస్తున్నాయి వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు క్రిష్ ఓ కొత్త చిత్రం తీస్తున్నారు. దీన్ని 'కొండ పొలం' అనే నవల స్ఫూర్తితోనే రూపొందిస్తున్నారని సమాచారం. అటవీ నేపథ్యంతో సాగే ఈ చిత్రం.. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
- తెలంగాణలో నిజాంపై పోరాటంతో ముడిపడి ఉన్న నేపథ్యంతో సాగే 'ఒక నజియా కోసం' నవలా హక్కులను ఇటీవల ఓ ప్రముఖ దర్శకులు కొన్నట్లు తెలుస్తోంది.
- మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' నవలాధారిత చిత్రమే. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా రూపొందిస్తున్నారు. విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇదీ చిత్రీకరణ దశలోనే ఉంది.
- తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 'స్నాక్ మూవీస్' పేరుతో ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీంట్లో అన్నీ అటు ఇటుగా 10 నిమిషాల నిడివి ఉండే చిత్రాలే ఉంటాయి. ఇప్పుడు దీనికోసమే రచయిత శ్రీరమణ 'బంగారు మురుగు' కథల్ని వెబ్‌సిరీస్‌గా మార్చే ప్రయత్నం చేస్తోందని సమాచారం.