ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'(rrr release date). షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా కోసం పీవీఆర్ సంస్థ ఏకంగా తమ పేరు మార్చుకుని 'పీవీఆర్ఆర్ఆర్'గా రూపాంతరం చెందింది. రాబోయే కొన్ని నెలల పాటు PV'RRR'గానే థియేటర్లపై పేరు ఉండనుంది. ముంబయి అంధేరీలోని ఓ థియేటర్లో చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న పలు వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సీజన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'తో పాటు అన్ని సినిమాలు విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
జనవరి 6న ఆలియా భట్ నటించిన 'గంగూభాయ్ కతియావాడి'తో పాటు 14న 'రాధేశ్యామ్' చిత్రాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జక్కన్న.. "సినిమాల మధ్య పోటీతో బిజినెస్ దెబ్బతినదు. ఓ సీజన్లో నాలుగు సినిమాలు రిలీజైనా.. అవి బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇలాంటివి ఇంతకుముందు చాలా జరిగాయి. కరోనా కారణంగా ఏడాదిన్నర పాటు అన్నీ స్తంభించాయి. దీంతో కొత్త చిత్రాల మధ్య పోటీ తప్పదు. కంటెంట్ గొప్పగా ఉంటే ఎన్ని సినిమాలు ఒకే రోజు విడుదలైనా ఇబ్బంది ఉండదు. ప్రేక్షకులు వారి ఆసక్తిని బట్టి సినిమాలు చూడటానికి వస్తారు" అని వెల్లడించారు.
అలాగే ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' రాబోతుందన్న వార్తలపైనా స్పందించారు రాజమౌళి. తాను థియేటర్ల కోసమే సినిమాలు తీస్తానని స్పష్టం చేశారు. "థియేటర్ల కోసమే నేను సినిమాలు తీస్తా. ప్రేక్షకులు కలిసి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలనే నేను అనుకుంటా. ఇందులో మరో ఆలోచన ఉండదు" అంటూ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
"వివిధ ఇండస్ట్రీల నుంచి స్టార్స్‌ను మీ సినిమాల్లో తీసుకోవడానికి ఎలాంటి ప్రణాలికలు చేస్తారు?' అన్న ప్రశ్నకు "నటులను ఉత్తర, దక్షిణ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ వారిగా చూడను. అలాగే ప్రేక్షకుల్ని హిందీ, తమిళం, మలయాళం వారని చూడను. ఓ స్టోరీ రాసుకుంటా.. దానికి సరిపోయే ఉత్తమ నటులను ఎంపిక చేసుకుంటా. 'నేను ఇలాంటి స్టోరీ రాసుకున్నా.. మీ పాత్ర ఇలా ఉంటుంది. మీకు నచ్చిందా?' అని అడిగేస్తా. నాకు 'బహుబలి' లాంటి గొప్ప విజయం దక్కింది. అలా అని ఆ పేరును వాడుకుని నేను నటుల దగ్గరికి వెళ్లను. నా స్టోరీ, పాత్రలను చూసుకునే వారి వద్దకు వెళతానని" క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్‌చరణ్(ram charan movies), భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్(alia bhatt husband), ఒలీవియా మోరిస్ కథానాయికలు.అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, ఎస్.ఎస్. రాజమౌళి(rajamouli upcoming movies) దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూ.450 కోట్లతో దానయ్య నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రానుందీ సినిమా.