కొత్త కథలు.. కొత్త కలయికలే కాదు.. కొత్త జోడీలు సినీప్రియుల్ని ఊరిస్తుంటాయి. విడుదలకి ముందే సినిమాలకు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెడుతుంటాయి. అగ్ర హీరో కుర్ర నాయికతో చిందేసినా.. స్టార్ నాయిక యువ హీరోతో జోడీ కట్టినా.. ప్రేక్షకుల కళ్లన్నీ ఆ చిత్రాలపైనే ఉంటాయి. అందుకే ప్రతి దర్శక, నిర్మాత సాధ్యమైనంత వరకు ఓ కొత్త జోడీనే తెరపై చూపించాలని తాపత్రయపడుతుంటారు. ఇప్పుడిలాంటి పలు కొత్త జంటలు వెండితెరపై సందడి చేసేందుకు ముస్తాబవుతున్నాయి.
పవన్‌తో.. తొలి తొలిగా
కథానాయకుడు పవన్ కల్యాణ్ రీఎంట్రీలో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో పాటు కె.సాగర్ చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు సినిమాల్లోనూ.. కొత్త జోడీలతోనే ఆడిపాడుతున్నారు పవన్. 'వీరమల్లు' కోసమే తొలిసారి పవన్‌తో జోడీ కట్టే అవకాశం దక్కించుకున్నారు నిధి అగర్వాల్, బాలీవుడ్ అందం జాక్వెలెన్ ఫెర్నాండేజ్. నిధి ఓ రాకుమారి పాత్రలో కనిపించనుండగా.. జాక్వెలెన్ ఒక దొంగగా దర్శనమివ్వనుందని సమాచారం. పవన్ - రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అయ్యప్పనుమ్' రీమేక్‌లోనూ కొత్త జంటలే కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే ఇందులో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేయగా.. పవన్ సరసన కనిపించనున్న నాయిక ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆ పాత్ర కోసం నిన్నమొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించినా.. ఇప్పుడా అవకాశం నిత్యామేనన్‌కు దక్కిందని సమాచారం. ఇది ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలోకి రానుంది.
మురిపించే జోడీలు
'బాహుబలి', 'సాహో' చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు కథా నాయకుడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘సలార్’లో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుండగా.. ఓం రౌత్ రూపొందిస్తున్న 'ఆదిపురుష్'లో కృతి సనన్ కనువిందు చేయనుంది. ఇక నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కలయికలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో దీపిక పదుకొణే సందడి చేయనుంది. వీటిలో 'సలార్' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న.. 'ఆదిపురుష్' ఆగస్టు 11న విడుదల కానున్నాయి.
కొత్త భామలతో ఆట
'క్రాక్' విజయంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు రవితేజ. ఇప్పుడీ జోష్‌లోనే 'ఖిలాడీ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. మే 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రం పూర్తికాగానే దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. ఇందులో ఆయన ఇద్దరు కొత్త భామలతో సందడి చేయనున్నారు. దీంట్లో ఓ కథానాయికగా లవ్‌లీ సింగ్.. మరో నాయికగా ఐశ్వర్య మేనన్ కనిపించనున్నారని సమాచారం. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం..ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే థియేటర్లలోకి రానుంది.
ముగ్గురు భామల ముద్దుల ప్రియుడు
ప్రేమకథలకు పెట్టింది పేరు అక్కినేని నాగచైతన్య. ఇప్పుడాయన హీరోగా విక్రమ్.కె.కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'థాంక్యూ'. ఓ విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రమిది. ఇందులో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు ఆడిపాడనున్నారు. ఇప్పటికే ఓ నాయికగా నభా నటేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. మిగతా రెండు పాత్రల కోసం మాళవికా నాయర్, ప్రియాంక అరుళ్ మోహన్ పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో చైతూ.. మహేష్‌బాబు అభిమానిగా కనిపించనున్నారని సమాచారం.
కొత్త పంథా..
నాయికా ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న అనుష్క.. ఇప్పుడు పంథా మార్చుతోంది. మహేష్ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం కోసం స్వీటీ తొలిసారి యువ హీరో నవీన్ పొలిశెట్టితో జోడీ కట్టనుందని సమాచారం. ఓ వైవిధ్యభరితమైన ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. నలభై ఏళ్ల మహిళ వయసులో తన కన్నా చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ సంస్థలో నిర్మితం కానున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇస్మార్ట్‌తో ఉప్పెన అందం..
'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరపై ఎగసిన కొత్త అందం కృతి శెట్టి. సుధీర్‌కు జోడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు తొలిసారి రామ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఎన్.లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రమిది. ఓ ఊర మాస్ కథాంశంతో రూపొందనుంది. ఇందులో మరో నాయికగా ప్రియాంక మోహన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.