48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల్లో ఉత్తమ డ్రామా సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన 'దిల్లీ క్రైమ్' నిలిచింది. భారత-కెనడీయన్ దర్శకుడు రిచీ మెహతా దీనిని తెరకెక్కించారు. న్యూయార్క్‌లో నటుడు రిచర్డ్ కైండ్, సోమవారం వర్చువల్‌గా ఈ వేడుకను నిర్వహించారు.
మహిళలకు అంకితం
"పురుషుల హింసను భరించడమే కాకుండా.. సమస్యను పరిష్కరించడానికి ఉద్యమిస్తున్న మహిళలందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను" అని దర్శకుడు రిచీ మెహతా చెప్పారు.
దిల్లీ రేప్ కేసు ఆధారంగా..
2012 డిసెంబరు 16న దిల్లీలో అర్థరాత్రి 23 ఏళ్ల యువతిపై కదిలే బస్సులో అత్యాచారం జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసిన దిల్లీ పోలీసుల బృందం కథనం ప్రకారం ఈ సిరీస్ రూపొందించారు. బాధితురాలిని తీవ్రంగా గాయపరిచిన నిందితులు రోడ్డుపైనే విడిచిపెట్టారు. అత్యాధునిక వైద్యం కోసం యువతిని సింగపూర్ తరలించగా.. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచింది.
'దిల్లీ క్రైమ్' వెబ్‌సిరీస్‌లో కేసును దర్యాప్తు అధికారిణి వర్తిక చతుర్వేది పాత్రలో షెఫాలీ షా నటించారు. అప్పటి దిల్లీ డీసీపీ చయా శర్మ.. 72 గంటల్లోనే ఈ కేసును చేధించారు. దిల్లీ అత్యాచార ఘటనపై రూపొందిన ఈ సిరీస్.. 2019లో విడుదలై ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. షెఫాలీ షా, రసిక దుగ్గల్, అదిల్ హుస్సేన్, రాజేశ్ తైలాంగ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
మరో రెండు సిరీస్‌లు
దీనితో మరో రెండు భారతీయ సిరీస్‌లు.. 'ఫోర్ మోర్ షాట్స్' (అమెజాన్ ప్రైమ్), 'మేడ్ ఇన్ హెవెన్' నామినేషన్ల బరిలో నిలిచాయి. కానీ, ఈ రెండు పురస్కారాన్ని అందుకోలేకపోయాయి.