'సింహా', 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్', ఈ టైటిళ్లన్నీ బాలకృష్ణను వెతుక్కుంటూ వెళ్తాయి. ఆయన శైలికి అవి అచ్చుగుద్దినట్టు సరిపోతాయి! సెట్లో ఆయన సింహంలానే ఉంటాడు. డైలాగులు చెప్పే రీతిలో ఆయన లెజెండ్. దశబ్దాలుగా బాక్సాఫీస్ దగ్గర డిక్టేటర్‌గా అధికారం చలాయిస్తున్నాడు. అందుకే ఆయన అభిమాన గణానికి 'రూలర్'గా మారిపోయాడు. ఈ వయసులోనూ ఉరకలెత్తే ఉత్సాహం బాలకృష్ణ సొంతం. అందుకే సెంచరీ సినిమాల తరవాత మరింత జోరు పెంచాడు. ఈ ఏడాది తన మూడో సినిమా 'రూలర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం వడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రత్యేకంగా సంభాషించాడు.
అభిమాని పంపిన ఫొటో
చాలా రోజుల క్రితం ఓ అభిమాని నాకు వాట్సప్‌లో ఓ ఫొటో పంపించాడు. హాలీవుడ్ స్టార్‌కు సంబంధించిన ఛాయాచిత్రమది. ఫ్రెంచ్‌కట్ గడ్డంతో చాలా ముచ్చటగా అనిపించింది. 'మిమ్మల్ని ఈ గెటప్‌లో చూడాలని ఉంది' అని అతడేం అనలేదు. కానీ ఆ ఫొటో దాచుకున్నాను. 'రూలర్'లో గెటప్పుల ప్రస్తావన వచ్చినప్పుడు అభిమాని పంపిన ఫొటో గుర్తొచ్చింది. దాన్ని ఫాలో అయిపోయాను. 'ఈ గెటప్ బాగుంటుందా, లేదా' అని దర్శకుడిని అడిగితే కాస్త సందేహించారు. కానీ నా మనసు మాత్రం బాగుంటుంది అనే చెప్పింది. ఆ గెటప్‌లో మారి సెట్‌లోకి వెళ్తే అంతా ఆశ్చర్యపోయారు.
కేవలం ఐదు నెలల్లో 'రూలర్' సినిమాను పూర్తి చేయగలిగారు. ఆ రహస్యం ఏంటి?
'గౌతమిపుత్ర శాతకర్ణి' ఇంతకంటే త్వరగా పూర్తి చేశాం కదా? పైగా అది కాస్ట్యూమ్ డ్రామా. పెద్ద పెద్ద సెట్లు, హడావుడి ఉన్నా, చక చక లాగించేశాం. దాంతో పోలిస్తే 'రూలర్'ను ఐదు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద విశేషంలా నాకు అనిపించడం లేదు. కె.ఎస్.రవికుమార్ చాలా స్పీడు. కల్యాణ్ అంతే. మేం ముగ్గురం వేగంగా నిర్ణయాలు తీసుకునేవాళ్లమే. కాబట్టి ఈ ఫీట్ సాధించాం.
స్క్రిప్టు పక్కాగా ఉన్నప్పుడు వేగంగా పూర్తి చేయడం పెద్ద సమస్య కాదంటారు కదా?
అవును. నాన్నగారూ అంతే. స్టాప్ వాచ్ చేతిలో పెట్టుకుని స్క్రిప్టు చదువుతుండేవారు. పుండరీకాక్షయ్య లాంటి సన్నిహితులు ఆయన దగ్గరకు రోజూ వస్తుండేవారు. ఆ సమయానికి ఎవరుంటే వాళ్లకు స్క్రిప్టు చేతికి అందించి.. ఈ డైలాగు మీరు చెప్పండి’ అంటూ నిడివి ఎంత వస్తుందో వాచ్‌లో చూసేవారు. దానికి ఒక్క సెకను అటూ ఇటూ కాకుండా తెరకెక్కించేవారు. నాన్నగారు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ పక్కా ప్రణాళికతో సాగేవి. నాకూ ఆ పద్ధతే ఇష్టం. ‘రూలర్’ను అలానే తెరకెక్కించాం. ఒక్క సన్నివేశం అనవసరంగా తీయలేదు. ఇది డిజిటల్ యుగం.. కొన్ని సన్నివేశాలు తీసుకుని, నచ్చకపోతే తొలగించవచ్చు. ఆ సౌలభ్యం ఉన్నా, మేం వృథా చేయలేదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశానికి రెండు వెర్షన్లు తీశామంతే. అందులో ఏది బాగుందో అదే ఫైనల్ చేశాం.
ఈ కథను సిద్ధం చేయడంలో మీ ప్రమేయం ఉందంటున్నారు?
ఇది వరకు ఓ కథ అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో పరుచూరి మురళి గుర్తొచ్చారు. నా శైలి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనకు ఫోన్ చేసి 'కథేమైనా ఉందా' అని అడిగాను. అప్పుడు 'రూలర్'ను ఒక లైన్‌గా చెప్పారు. స్క్రిప్టులో రెండు రకాలు. ఒకరు టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకూ చెబుతారు. పంచభక్ష్య పరమాన్నంలా అన్నీ సిద్ధంగా ఉంటాయి. కొంతమంది లైన్లు చెబుతారు. బోయపాటి శ్రీను నాకెప్పుడూ పూర్తి కథ చెప్పరు. కొన్ని సన్నివేశాలు వివరిస్తారంతే. 'ట్రాక్‌లో ఉన్నాయా లేదా' అనేది నాకు తెలిసిపోతుంది. అలా కొంతమంది దగ్గరే జరుగుతుంది. 'రూలర్' లైన్ చెప్పినప్పుడు పోలీస్ పాత్ర లేదు. అది నా నుంచి వచ్చిన ఆలోచన. ఇలా కొన్ని సూచనలు నేను ఇస్తుంటాను. కొన్నిసార్లు మా చర్చల నుంచే సంభాషణలు, హావభావాలూ పుడుతుంటాయి.
ఈమధ్య బరువు బాగా తగ్గారు. అందుకోసం ఏం చేశారు?
ప్రత్యేకమైన కసరత్తులేం లేవు. 'బరువు తగ్గాలి..' అనిపించింది. దాదాపు 9 కిలోలు తగ్గాను. నా శరీరం నేను చెప్పినట్టు వింటుంది. నా పాత్రకు తగినట్టు స్పందిస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సమయంలోనూ అంతే. 'ధృఢంగా.. ఓ వీరుడిలా కనిపించాలి' అనుకున్నాను. అలా తయారయ్యాను. బోయపాటి శ్రీను సినిమా కోసం ఫిట్‌గా తయారవ్వాలి అనిపించింది. చేశాను.
‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలు అన్ని రకాలుగానూ సంతృప్తిని అందించాయా?
ఓ కొడుకుగా మా నాన్నగారి కథను తెరకెక్కించాన్న సంతృప్తి ఉంది. అయితే ఆ చిత్రాలు సరిగా ఆడలేదు. దానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు.
'రైతు' పేరుతో ఓ చిత్రాన్ని తీయాలనుకున్నారు. అది ఏమైంది?
నాకు నచ్చిన కథ అది. ఓ సూపర్ స్టార్‌తో కీలక పాత్ర చేయించాలనుకున్నాం. ఆయన డేట్లు దొరకలేదు. ఆయన లేకపోతే ఆ సినిమా చేయడం అనవసరం అనిపించింది. అందుకే పక్కన పెట్టేశాం. సరైన నటీనటులు లేకపోతే నేను సినిమా చేయలేను. 'నర్తన శాల' అంతే. నేను అనుకున్న నటీనటులు ఇప్పుడు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టును ఆపేశాం.
ఈమధ్య దిశ ఘటనతో దేశమంతా చలించిపోయింది. ఇలాంటి వైపరీత్యాలకు సినిమా కూడా పరోక్షంగా కారణం అవుతుందన్న విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో ఓ నటుడిగా మీ అభిప్రాయం ఏంటి?
ఓ వ్యక్తిగా ఆ ఘటన నన్ను చాలా కలచివేసింది. ఇలాంటి దారుణాలు ఇంకెప్పుడూ జరక్కూడదు. ఇలాంటి ప్రతి ఘటన వెనుక సామాజిక కారణాలెన్నో ఉంటాయి. కానీ ఏం జరిగినా సినిమాల ప్రభావం ఉందన్నట్టు మాట్లాడుతుంటారు. సినిమాలకు సామాజిక బాధ్యత ఉంది. ఏ కథ నుంచైనా మంచి చెప్పాలనే చూస్తాం. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు'లో ఫ్యాక్షన్ వద్దనే చెప్పాం. నా ప్రతి సినిమాలోనూ మహిళల గొప్పదనం తెలిపే సంభాషణలు ఉంటాయి. 'లెజెండ్'లోని డైలాగులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 'రూలర్'లోనూ అంతే. రైతు గొప్పదనం చెప్పాం. ఇలా ప్రతి సినిమాలోనూ నావంతు బాధ్యత నేను నెరవేరుస్తా.
మీ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తనకు సినిమాలపై ఆసక్తి ఉందా? వాటి గురించి మీతో మాట్లాడుతుంటాడా?
చదువుకునే రోజుల్లో కేవలం వాడి దృష్టి చదువుపైనే ఉండేది. ఇప్పుడు సినిమాల గురించీ ఆలోచిస్తున్నాడు. నాతో చర్చిస్తున్నాడు. తప్పకుండా వాడిని తెరపై చూస్తారు. కానీ అదెప్పుడన్నది చెప్పలేను.
రోజూ మీ నాన్నగారి సినిమాల్ని చూడడం మీకు అలవాటు. మరి ఈతరం సినిమాల్ని చూడరా?
అస్సలు చూడను. అలాగని మంచి సినిమాలు రావడం లేదనో, ఈతరం సరిగా చేయడం లేదనో కాదు. చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిని చూస్తే ఆ ప్రభావం నాపై పడిపోతుందేమో, అలాంటి సినిమాల్ని చేయాలనుకుంటానేమో అని భయం. నా దగ్గరకు వచ్చే కథలు నాకు ఎలాగూ వస్తుంటాయి. ఈమధ్య కాలంలో కథలు ఎక్కువగా వింటున్నాను. ఎక్కువ సినిమాలు చేయాలన్న ఉత్సాహం కలుగుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తాను. ఓరోజు రాత్రి సడన్‌గా 'ఆదిత్య 999' కథ తట్టింది. తెల్లారేసరికి కథ సిద్ధమైంది.
మరి ఆ సినిమా ఎప్పుడు... మీరు దర్శకత్వం వహిస్తారా?
త్వరలో తప్పకుండా ఉంటుంది. దర్శకత్వం వహించాలని ఉంది. కానీ ఇప్పుడే చెప్పలేను. 'ఆదిత్య 369'లో భూత, భవిష్యత్, వర్తమానాలు చూసేశారు. 'ఆదిత్య 999' ఓరకంగా ప్రయోగాత్మక చిత్రం. చాలా వింతలూ, విశేషాలూ ఉంటాయి.
నా దృష్టిలో నిజమైన 'రూలర్' గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన్ని మించిన పాలకుడు లేడు. దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపించాడు. ఆయన కథలోనూ నేను నటించాను. కాబట్టి ఆయనే నాకిష్టమైన 'రూలర్'. ప్రపంచ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోను. అప్పుడప్పుడూ టీవీ చూస్తూ కొన్ని విషయాలు తెలుసుకుంటుంటా. చిన్నప్పుడు మా పిల్లలకు మాత్రం వాటి గురించి తరచూ చెప్పేవాణ్ని. ఎదుగుతున్న పిల్లలు.. సమాజం గురించి తెలుసుకోవాలి అనేది నా ఆలోచన. పైగా పోటీ తత్వం పెరిగింది. ఏ విషయంలోనూ వెనుకబడకూడదు కదా.