మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కూడా తమవైపే ఉన్నాయని నటుడు నాగబాబు అన్నారు. 'మా' ఎలక్షన్స్ నేపథ్యంలో తాజాగా ప్రకాశ్‌రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ‘సినిమా బిడ్డల ప్యానల్’కు మద్దతిస్తూ నాగబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశ్‌రాజ్ మంచి మనస్సున్న వ్యక్తి అని.. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ‘మా’కు ఎంతో అవసరమని అన్నారు.
"రెండు నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ నావద్దకు వచ్చారు. ప్రస్తుతం 'మా'లో ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. అలాగే 'మా'ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడానికి ఆచరించాల్సిన ప్రణాళికలు తెలిపారు. ఆ మాటల విన్నాక ఆయనపై నాకెంతో నమ్మకం వచ్చింది. ప్రకాశ్‌రాజ్‌కు అన్ని చిత్రపరిశ్రమలతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ఆయనకు మంచి అనుబంధాలున్నాయి. నటీనటులందరితో చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి ఆయన. గడిచిన కొంతకాలం నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నాకెంతో ముచ్చటగా అనిపించింది. తన దగ్గర పనిచేవాళ్లకు కూడా ప్రకాశ్ సాయం చేశాడు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో కలిసిపోయే ఇలాంటి వ్యక్తే ఇప్పుడు ‘మా’కి ఎంతో అవసరం."
"లోకల్, నాన్‌లోకల్ అనేది అర్థరహిత వాదన. 'మా'లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో ఏ పదవికోసమైనా పోటీ చేసే హక్కు ఉంది. ప్రకాశ్‌రాజ్ ఎక్కడ పుట్టాడు? ఏం చేశాడు? అనేది అనవసరం. ఆయన ఇక్కడ గ్రామాలు దత్తత తీసుకుని.. ఇక్కడే సెటిలైన వ్యక్తి. ఆయనలోని సేవాగుణం, ‘మా’ కోసం ఆయన వేసిన ప్రణాళికలు చూసి నా సపోర్ట్ ఇవ్వాలని ముందుకు వచ్చా. ఒకరకంగా చెప్పాలంటే అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్లానింగ్ గురించి అన్నయ్యతో చెప్పినప్పుడు.. 'ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను సపోర్ట్ చేస్తా' అని అన్నారు. నిజం చెప్పాలంటే.. నాలుగేళ్ల నుంచి అసోసియేషన్ మసకబారింది. బయట అసోసియేషన్ గౌరవం తగ్గింది. అసోసియేషన్ స్థితిగతులు తప్పకుండా మార్చుతాం" అని నాగబాబు వివరించారు.