సస్పెన్స్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కి, బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'అంధాధున్'. ఇప్పుడు అదే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో రూపొందించిన సినిమా 'మాస్ట్రో'. నితిన్ కథానాయకుడిగా నభానటేశ్, తమన్నా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో నభానటేశ్ విలేకర్లతో ముచ్చటించింది. ఆ సరదా విశేషాలివే!
ఎప్పుడో చూశా..!
బాలీవుడ్‌లో తెరకెక్కిన 'అంధాధున్' చిత్రాన్ని ఆధారంగా చేసుకుని 'మాస్ట్రో' రూపొందించాం. ‘అంధాదున్’ విడుదలైనప్పుడే సినిమా చూశాను. అది నాకెంతో నచ్చేసింది. చాలా విభిన్నమైన కథాంశంతో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా సాగిపోతుంది. ఈ సినిమా తర్వాతే బాలీవుడ్‌లో ఇలాంటి జానర్ కథాంశాలకు మరింత పాపులారిటీ పెరిగింది.
కంగారుపడ్డా..!
'మాస్ట్రో'లో ఆఫర్ వచ్చిందని తెలిసి వెంటనే ఫుల్ ఖుషీ అయిపోయా. రాధిక ఆప్టే పోషించిన పాత్రను 'మాస్ట్రో'లో నేను చేశాను. రాధికలాగా నేను నటించగలనా? ఒరిజినల్ సినిమాలోని పాత్రకు నేను తెలుగులో న్యాయం చేయగలనా? అని కంగారుగా అనిపించింది. రీమేక్ ఓకే అనుకున్నాక ఒక్కసారి కూడా ‘అంధాధున్’ వీక్షించలేదు.
నితిన్‌తో నటించడం బాగుంది..!
ఈ ఏడాది జనవరి నెలలో ‘మాస్ట్రో’ షూట్ ప్రారంభించాం. కరోనా ఫస్ట్ వేవ్ కంట్రోల్ అయ్యాక షూట్ ప్రారంభించిన అతి తక్కువ మందిలో మా ప్రాజెక్ట్ కూడా ఒకటి. అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్ చేశాం. నితిన్ మంచి వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అలాగే ఆయన కెరీర్‌లోనే ఇదో విభిన్నమైన పాత్ర అవుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.
ఓటీటీతో..!
నేను కథానాయికగా నటించిన రెండు సినిమాలు లాక్‌డౌన్ సమయంలోనే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. కరోనా తర్వాత ఇది నా మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ‘ఈ సినిమా ఓటీటీలో వస్తుంది’ అని అనుకునేదాన్ని. కానీ మొదటి రెండు సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యాయి. మూడో సినిమా ఓటీటీలో వస్తోంది. అందుకు ఇప్పుడు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ‘మాస్ట్రో’ అందరికీ రీచ్ కావాల్సిన మంచి చిత్రం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు అందరూ వస్తారని చెప్పలేం. కాబట్టి ఓటీటీలో విడుదల చేస్తే తప్పకుండా ఈసినిమా అందరికీ చేరువయ్యే అవకాశం ఉంది.
తెలుగుకు అనుగుణంగా..!
'అంధాధున్' మెయిన్ లైన్ మాత్రమే తీసుకుని దర్శకుడు తన విజన్‌తో ‘మాస్ట్రో’ తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. నేను మొదటిసారి రీమేక్‌లో నటిస్తున్నాను. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డబ్బింగ్ అనుకున్నాక.. కానీ:
డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతా.
అన్ని రకాల పాత్రల్లో..
భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకూ ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ‘మాస్ట్రో’లోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను.