2020 గ్రామీ అవార్డుల ముందస్తు వేడుక లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం జరిగింది. ఇందులో యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆమె రాసిన 'బికమింగ్' అనే ఆడియో ఆల్బమ్.. ఈ పురస్కారం సొంతం చేసుకుంది. 'బికమింగ్'లో మిషెల్.. తన జీవిత ప్రయాణం గురించి ప్రస్థావించారు. చికాగో దక్షిణ భాగం నుంచి ఆమెరికా వరకు ఆమె సాగించిన ప్రస్థానమే ఈ 'బికమింగ్'.
మాజీ అధ్యక్షుడికీ రెండు అవార్డులు
మిచెల్ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పటికే రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. ఆయన రాసిన 'డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్'(2006), 'ద అడాసిటీ ఆఫ్ హోప్'(2008)లు ఈ ఘనత సాధించాయి.
రెండో మహిళగా మిషెల్
గ్రామీ అవార్డు దక్కించుకున్న రెండో 'తొలి' మహిళ మిషెల్ ఒబామా (అమెరికా అధ్యక్షుడి భార్యను 'తొలి మహిళ' అంటారు). బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భార్య, అమెరికా మాజీ సెక్రటరీ హిల్లరీ క్లింటన్.. 'ఇట్ టేక్స్ ఏ విలేజ్'(1997) పుస్తకానికి గ్రామీ అవార్డును కైవసం చేసుకున్నారు. బిల్ క్లింటన్ కూడా రెండు సార్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ సరసన ముద్దుగుమ్మ రష్మిక!