కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతితో ఆయన కుటుంబం సహా, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా భర్తను తలుచుకుంటూ ఆయన భార్య మేఘనారాజ్ కుమిలిపోతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. తాను తండ్రి కాబోతున్నానని తెలిసిన వెంటనే చిరు ఎంతో సంతోషించారు. త్వరలోనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని అనుకుంటున్న తరుణంలోనే విధి, వీరి బంధాన్ని విడదీసింది. ఈ సందర్భంగా మేఘనా రాజ్ ఓ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.
"చిరు.. నీతో ఓ విషయం పంచుకోవడానికి పదే పదే ప్రయత్నించినా దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నీవు నాకు ఏమవుతావో చెప్పడానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ పదాలతో అది వర్ణించడం సాధ్యం కాదు. మై ఫ్రెండ్, మై లవర్, మై పార్టనర్, మై చైల్డ్, మై కాన్ఫిడెంట్, మై హజ్బెండ్ వీటన్నింటి కన్నా నువ్వు నాకు చాలా ఎక్కువ. నువ్వు నా ఆత్మలో ఒక భాగానివి"
"తలుపువైపు చూసిన ప్రతిసారీ 'నేను ఇంటికొచ్చేశా' అంటూ నువ్వు కేకలు పెడుతూ రాకపోవడాన్ని చూసి ఓ లోతైన బాధ నా గుండెల్ని గుచ్చేస్తోంది. ప్రతి రోజూ, ప్రతి నిమిషం నీవు లేవన్న భావన నా హృదయాన్ని ముంచేస్తోంది. వేయిసార్లు మరణించినంత బాధగా ఉంది. నేను నీరసించి పోయిన ప్రతిసారీ నన్ను రక్షించే దేవుడిలా నా చుట్టూ నువ్వు ఉన్న భావన కలుగుతోంది"
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నువ్వు నాపై ఎంతో ప్రేమను చూపించావు. అందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేదు. అవునా? నువ్వు నాకు ఇచ్చిన అద్భుతమైన బహుమతి మన చిన్నారి. మన ప్రేమకు చిహ్నం. ఈ తీయనైన అద్భుతాన్ని నాకు ఇచ్చినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నిన్ను మన బిడ్డగా ఈ భూమ్మీద చూడటానికి వేచి ఉండటం నా వల్ల కావటం లేదు. నిన్ను తాకడానికి, నీ చిరునవ్వు చూసేందుకు వేచి చూడాల్సి రావడం నాకు సాధ్యం కావటం లేదు. నేను నీకోసం నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నాం. నా తుది శ్వాస వరకూ నాలో నువ్వు బతికే ఉంటావు. ఐ లవ్‌యూ" అని మేఘనారాజ్ రాసుకొచ్చారు.
2018 మే 2న చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, రెండేళ్లు పూర్తయిందని 2020 మే 2న మేఘనా రాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.