మార్లిన్ మన్రో.. 50వ దశకంలో హాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న సుందరి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మార్లిన్ మూడు పదుల వయసులోనే మరణించింది. ఇప్పుడు ఈమె జీవితం టీవీ సిరీస్‌గా రాబోతుంది. ప్రస్తుతానికి 'ద లాస్ట్ డేస్ ఆఫ్ మార్లిన్ మన్రో' అనే వర్కింగ్ టైటిల్‌తో బీబీసీ స్టూడియోస్ నిర్మిస్తోంది.
ప్రముఖ రచయిత కీత్ బ్యాడ్మాన్ పుస్తకం 'ఫైనల్ ఇయర్స్ ఆఫ్ మార్లిన్ మన్రో: ద షాకింగ్ ట్రూ స్టోరీ' ఆధారంగా ఈ సిరీస్ తీస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోస్‌తో ఆమెకున్న అనుబంధం, మార్లిన్ చివరి రోజుల్లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి, రాబర్ట్ కెనడీలతో సంబంధం లాంటి అంశాలను ఈ టీవీ సిరీస్‌లో ప్రస్తావించనున్నారు.
1962లో మార్లిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు నిర్ధరించారు. కానీ ఇప్పటికీ ఆమె మృతిపై పలు అనుమానాలున్నాయి. ఆమె మరణించిన ముందురోజు రాత్రి ఏం జరిగిందో ఇందులో చూపించనుంది చిత్రబృందం.
హాలీవుడ్ ఫేమస్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మార్లిన్ జీవితంపై ఇప్పటికే కొన్ని టీవీ సిరీస్‌లు వచ్చాయి. 2011లో 'మై వీక్ విత్ మార్లిన్', 2015లో 'ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ మార్లిన్ మన్రో' లాంటి డ్రామా సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి.