మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (MAA Elections) వ్యవహారంతో జూన్ నెల మొత్తం వాడీవేడీగా గడిచిపోయింది. నటీనటుల మాటల తూటాలతో ప్రతిఒక్కరి చూపు 'మా' పైనే ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సిని'మా' వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ట్విటర్ వేదికగా ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్, అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) మాటకు మాట సమాధానమిచ్చుకున్నారు.
ఈ ఏడాది 'మా' ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానల్‌ను సిద్ధం చేసుకున్న ప్రకాశ్‌రాజ్.. ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల 'ఎన్నికలు ఎప్పుడు? #JUST Asking' అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే, ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై నరేశ్ స్పందించారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి మా సమాధానమిదే అంటూ సెటైర్ వేశారు.
"ఎన్నికల విషయమై ఇప్పటికే 'మా' నుంచి ఎన్నో సార్లు సమాధానం ఇచ్చినప్పటికీ కొంతమంది మరలా అదే పనిగా 'ఎన్నికలు ఎప్పుడు?' అంటూ ప్రశ్నించడాన్ని చూస్తుంటే.. 'నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్‌లోకి దూకానా?' అని అడిగినట్లు ఉంది"
- నరేశ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు
అంతేకాకుండా, సెప్టెంబర్‌లో 'మా' ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న జనరల్ బాడీ మీటింగ్ వాయిదా పడిందని.. పరిస్థితులు చక్కబడిన వెంటనే మీటింగ్ పెట్టి.. గడిచిన రెండేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను అందరికీ తెలియచేస్తామని నరేశ్ వెల్లడించారు.
ఈ ఏడాది 'మా' ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరగనున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు 'మా' సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, మంచువిష్ణు, జీవితా రాజశేఖర్, హేమతోపాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.
ఇదీ చూడండి.. MAA ELECTIONS: 'నాగబాబు వ్యాఖ్యలు తప్పుబట్టిన నరేశ్'