'సినిమా బిడ్డలం' ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి.. 'మా' సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.
అప్పుడే రాజీనామా వెనక్కి తీసుకుంటా..
"నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 'మా' నియమ, నిబంధనలు మార్చి.. 'తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు' అని మీరు మార్చకపోతే 'మా' సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు" అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
ఇదీ చూడండి.. 'మా'కు పోటీగా మరో అసోసియేషన్?