మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని సినీ నటుడు నాగబాబు ఆరోపించారు. బుధవారం ఆయన ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రకాశ్‌రాజ్ భారతీయనటుడని, ఆయన తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటరని ప్రశ్నించారు. చిన్న, పెద్ద సినిమా ఏదైనా వాళ్లకు ప్రకాశ్‌రాజ్ కావాలని అన్నారు.
"ప్రకాశ్‌రాజ్ కూరలో ఉప్పులాంటి వారు. ఆయన చిన్న సినిమా వాళ్లకు, పెద్ద సినిమా వాళ్లకూ కావాలి. నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాశ్‌రాజ్‌ను అందరూ ఒప్పుకోవాల్సిందే! 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తారని అస్సలు ఊహించలేదు. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్‌రాజ్. అంత మొత్తాన్ని వదులకుని 'మా' కోసం పనిచేయడానికి వచ్చారు. ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌లాంటివాళ్లు 'ప్రకాశ్‌రాజ్ ఎవరు?' అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అంటే అంత చులకనా? కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా? 'మా' అసోసియేషన్‌కు సేవ చేస్తానని వస్తానంటే కించపరుస్తారా? 'మా' ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.10 వేలు ఇస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతురన్నారట. 'మా' అసోసియేషన్ మసకబారబోతుంది. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. మా అసోసియేషన్ సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దు" అని నాగబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి.. MAA Elections: నరేశ్, కరాటే కల్యాణిలపై నటి హేమ ఫిర్యాదు