"పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు" అంటున్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన ట్విటర్‌లోకి అడుగిడి సంవత్సరం దాటిన నేపథ్యంలో.. శనివారం 'ఆస్క్ సిరి వెన్నెల' పేరుతో నెటిజన్లతో కాసేపు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సినీప్రియులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇన్నేళ్లుగా మిమ్మల్ని, మీ కలాన్ని నిరంతరాయంగా నడిపిస్తున్న స్ఫూర్తి ఏంటి?
సిరివెన్నెల: అత్యంత తీవ్రతతో ప్రతీ క్షణాన్ని గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం. అదే నా ప్రేరణ.
రచయితకు ఉండాల్సిన తొలి లక్షణమేంటి?
సిరివెన్నెల: తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకు స్పష్టంగా తెలియడం.
మళ్లీ తెలుగు సాహిత్యపు స్వర్ణ యుగం చూసేదెప్పుడు?
సిరివెన్నెల: సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలు అనేవి అన్ని విధాలుగా ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే.
ఇష్టమైన పుస్తకాలు, నవలలు?
సిరివెన్నెల: కవి వాల్మీకి అంటే ఇష్టం. భగవద్గీత, ఖలీల్ జీబ్రాన్ రాసిన 'ది ప్రాఫిట్' పుస్తకాలు బాగా ఇష్టం.
ఇదీ చూడండి: వేటూరి పేరుతో ఫాంట్ ఆవిష్కరించడం అదృష్టం