పెళ్లి, పిల్లలతోనే మహిళల జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అందుకే అమ్మాయిలకు రెండు పదుల వయసొస్తే చాలు 'మూడు ముళ్లెప్పుడు?' అని అడుగుతారు. అదే పెళ్లైతే 'పిల్లలెప్పుడు?' అని మరో ప్రశ్న వేస్తుంటారు. అయితే పెళ్లి, పిల్లలతోనే ఓ మహిళ జీవితం సంపూర్ణమవుతుందా? అంటే... కాదంటున్నారు కొంతమంది అందాల తారలు. వృత్తిపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరు యాభై ఏళ్లు దాటిపోతున్నా ఏడడుగులు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. కొందరైతే జీవితాంతం ఒంటరిగానే ఉంటామంటున్నారు. మరి వారెవరో తెలుసుకుందాం రండి.
తనీషా
43 ఏళ్ల తనీషా ముఖర్జీ తన 39 ఏళ్ల వయసులో అండాలను భద్రపరచుకున్నట్లు చెప్పి ఇటీవల అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'కంత్రి' సినిమాలోనూ నటించింది. బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరున్న ఈ అందాల తార ఇటీవల పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"మహిళల జీవితంలో రిలేషన్‌షిప్, పెళ్లి, పిల్లలు అనేవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇవే మన పూర్తి జీవితాన్ని నిర్వచిస్తాయనడం నిజం కాదు. పెళ్లి చేసుకోకపోయినా, పిల్లల్ని కనకపోయినా మనం కోల్పోయేదేమీ లేదు" అని తనీషా చెప్పుకొచ్చింది.
టబు
90ల్లో తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన అందాల నాయికల్లో టబు ఒకరు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ సత్తా చాటిందీ ముద్దుగుమ్మ. వృత్తిపరంగా అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 50 ఏళ్ల వయసు వచ్చినా వివాహం చేసుకోలేదు.
"జంటగా ఉంటేనే హ్యాపీగా ఉంటారంటే నేను నమ్మను. ఎందుకంటే సంతోషమనేది కేవలం రిలేషన్‌షిప్‌లోనే దొరకదు. దాన్ని మనం రోజూ చేసే ఏ పనిలోనైనా వెతుక్కోవచ్చు. మనం సింగిల్‌గా ఉంటూ ఒంటరితనాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు... కానీ అదే మన ఇష్టాయిష్టాల్ని, అభిరుచుల్ని గౌరవించని భాగస్వామి మన జీవితంలోకి వస్తే అంతకన్నా దుస్థితి మరొకటి ఉండదు. అందుకే నాకు నేనుగా ఈ ప్రపంచంలో ముందుకు సాగాలనుకుంటున్నా" అని ఓ సందర్భంలో వ్యాఖ్యానించిందీ అందాల తార.
సుస్మితా సేన్
సుస్మితా సేన్.. విశ్వసుందరిగా, నటిగా, మోడల్‌గా ఎందరికో సుపరిచితురాలైన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన పాతికేళ్ల వయసులోనే, అది కూడా పెళ్లి కాకుండానే 'రెనీ' అనే చిన్నారిని దత్తత తీసుకున్న ఈ భామ కొన్నేళ్లకు 'అలీషా'ను దత్తత తీసుకుంది. ప్రస్తుతం సింగిల్ మదర్‌గా వీరి ఆలనాపాలనను దగ్గరుండి మరీ చూసుకుంటోంది. మరికొన్ని నెలల్లో 50వ వసంతంలోకి అడుగు పెట్టనున్న సుస్మిత రోమన్‌షాల్‌తో డేటింగ్ చేస్తున్నప్పటికీ పెళ్లిపై మాత్రం పెదవి విప్పడం లేదు.
"పెళ్లిపై ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. ప్రస్తుతం నేను సింగిల్‌గా ఎంతో సంతోషంగా ఉంటున్నాను" అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
శోభన
80, 90ల్లో హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది శోభన. ఉత్తమ నటిగా రెండుసార్లు జాతీయ పురస్కారం అందుకున్న ఘనత ఆమె సొంతం. భరతనాట్యంలోనూ అద్భుతమైన ప్రావీణ్యమున్న శోభన వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు. ఈ క్రమంలో 'పెళ్లెందుకు చేసుకోలేదు?' అని ఓ సందర్భంలో ఆమెను అడగ్గా 'కేవలం పెళ్లి మాత్రమే సంతోషాన్నిస్తుంది అనుకోవడం పొరపాటు. దాని కంటే కూడా జీవితంలో సంతోషం పంచే విషయాలు చాలానే ఉన్నాయి. అవి మన ఎంపిక పైనే ఆధారపడి ఉంటాయి. ఒంటరిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను' అని సమాధానమిచ్చింది.
దివ్య దత్తా
'వీర్ జారా', 'వెల్‌కం టు సజ్జన్పూర్', 'దిల్లీ-6', 'భాగ్ మిల్కా భాగ్' సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య దత్తా. వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించిన దివ్య 43 ఏళ్లు దాటినప్పటికీ వివాహం చేసుకోలేదు.
అమీషా పటేల్
'నా జీవితంలో ఎంతోమంది మగాళ్లను చూశాను. కానీ నా ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునేవాడు మాత్రం దొరకలేదు. అందుకే పెళ్లి గురించి ఆలోచించడం లేదు" అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్.
'బద్రి', 'నాని', 'నరసింహుడు' చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది అమీషా పటేల్. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సత్తా చాటింది. కెరీర్‌పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఈ అమ్మడి వయసు 46 ఏళ్లు. అయినా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
నగ్మా
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటిగా వెలుగొందింది నగ్మా. హిందీ, కన్నడ, పంజాబీ, మరాఠీ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్న ఈ అందాల తార 46 ఏళ్లు దాటిపోతున్నా ఏడడుగులు వేసేందుకు మాత్రం ఎందుకో ఆసక్తి చూపడం లేదు.
సితార
'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్', 'శతమానం భవతి', 'భరత్ అనే నేను','అరవింద సమేత' తదితర హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సితార. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగానూ అలరిస్తోంది. సీరియల్స్‌లోనూ నటిస్తోన్న ఈమె వయసు కూడా 47 ఏళ్లకు పైనే. అయినా వైవాహిక బంధానికి దూరంగానే ఉంటోంది. సింగిల్ గానే ఉన్నా హ్యాపీగా ఉన్నానంటోంది.
కౌసల్య
'అల్లుడు గారు వచ్చారు', 'పంచదార చిలక' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కౌసల్య ఇప్పుడు సహాయ పాత్రల్లోనూ మెప్పిస్తోంది. 'రారండోయ్ వేడుక చూద్దాం', 'సవ్యసాచి','రంగ్‌దే' సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు తెలుగు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతోన్న ఈమె నాలుగు పదుల వయసు దాటినా మూడుముళ్ల బంధానికి మాత్రం దూరంగానే ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీరుకూడా
బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేత్రిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోన్న ఏక్తా కపూర్ (46) కూడా వివాహం చేసుకోలేదు. అయితే సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.
'రాక్‌స్టార్', 'మద్రాస్ కేఫ్', 'అజహర్' సినిమాలతో ఆకట్టుకున్న నర్గీస్ ఫక్రీ వయసు కూడా 41 ఏళ్లకు పైగానే. అయితే సింగిల్‌గానే ఉండడం తనకు ఇష్టమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బుల్లితెరతో పాటు 'దంగల్', 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటించిన సాక్షి తన్వర్ (48) సైతం పెళ్లికి దూరంగానే ఉంది.
ఇదీ చూడండి: అశ్లీల చిత్రాల కేసు.. నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు